సోషల్ మీడియాలో ఈ మధ్య తరచు వినిపిస్తున్న పదం ‘క్రింజ్ మూవీ’. భోళాశంకర్ విషయంలో ఇలాంటి విమర్శ సోషల్ మీడియాలో వస్తున్న సంగతిని దర్శకుడు మెహర్ రమేష్ దగ్గర ప్రస్తావించడం జరిగింది. దానికి ఆయన కాస్త సీరియస్ గానే స్పందించారు. అర్థం తెలియకుండానే క్రింజ్ అనే పదాన్ని వాడేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆ మాటకు వస్తే పండగకు వచ్చిన వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు అలాంటివే కదా అన్నారు. ఆదిపురుష్ సినిమాను కూడా కొందరు ఇలాగే అనేసారన్నారు. వేదాలం సినిమాను చూస్తే ఈ క్రింజ్ అనేది బోలెడు వుంటుందని, తమిళం వాళ్లకి అది నచ్చుతుందని, మనకు ఎంత కావాలో అంత తీసుకున్నామని వివరించారు.
మెగాస్టార్ తో సినిమా అన్నది తన జీవితపు కల అని అది ఇప్పటికి నెరవేరిందని మెహర్ రమేష్ అన్నారు. గత మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ మీదే వున్నానన్నారు. కరోనా టైమ్ లో అంతా ఖాళీగా వుంటే తాను ఈ ప్రాజెక్టు మీద వున్నానన్నారు. వేదాలం సినిమాలో మనకు ఏవి పనికిరావో వాటిని పక్కన పెట్టామన్నారు. వేదాలం సినిమాను తాను ఎలా తీయాలనుకుంటున్నానో వివరంగా చెప్పడం వల్లే మెగాస్టార్ ఓకె చేసారన్నారు.
ఎలా చూపిస్తే జనం ఎంటర్ టైన్ అవుతారో అలా సినిమాను ప్లాన్ చేసామన్నారు. ఉమెన్ ట్రాఫికింగ్ అన్న సబ్జెక్ట్ ఎప్పుడు టేకప్ చేసినా జనం కనెక్ట్ అవుతారని చెప్పారు. రైటర్ సత్యమూర్తి, ఇంకా ఇతర టీమ్ తో కలిసి స్క్రిప్ట్ తయారు చేసామన్నారు.
రీమేక్ లు మన హీరోలు ఎవరికీ కొత్త కాదని, మనకు సరైన కథలు దొరకనపుడు మంచి కథ ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చుకోవడం తప్పేం కాదన్నారు. తను హిట్ కొట్టాలని తన స్నేహితులైన దర్శకులు అంతా కోరుకున్నారని, తనకు ఏం సాయం కావాలన్నా చేయడానికి సిద్దం అన్నారని, కావాలంటే తలో వెర్షన్ తయారు చేసి ఇస్తామని చెప్పారన్నారు.