అధిష్టానం తనపై విశ్వాసం ఉంచినంత కాలం కర్ణాటక సీఎంగా తనే ఉంటానంటూ ప్రకటించుకున్నారు యడియూరప్ప. ఈయనను సీఎం పదవి నుంచి దించేయాలంటూ పలువురు బీజేపీ నేతలు అధిష్టానానికి కంప్లైంట్ చేయడంతో పాటు, బహిరంగ వ్యాఖ్యానాలు కూడా చేశారు. ఇప్పటికే కర్ణాటక విషయంలో బీజేపీ విధానాలు కంగాళీగా ఉన్నాయి. దీనికి తోడు కరోనా తీవ్ర రూపం దాల్చిన పరిస్థితుల్లో అక్కడ అధికార పార్టీ నేతలే ఈ తరహా రాజకీయం చేస్తూ ఉండటం తీవ్ర వివాదాస్పదం అవుతోంది.
సోమవారం నుంచి యడియూరప్ప తన వర్గానికి సమీకృతం చేసుకునే పనిలో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి. తన అనుకూల ఎమ్మెల్యేలతో ఆయన సమావేశాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. ఈ క్రమంలో రాజకీయ ఆధిపత్యం మొదలైనట్టే అని స్పష్టం అవుతోంది. అది కూడా బంతిని అధిష్టానం కోర్టుకు బహిరంగంగా నెట్టడం ద్వారా యడియూరప్ప తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
తనకు పదవి జారి పోయిన ప్రతిసారీ.. సానుభూతి అస్త్రాన్ని సంధించడం, ఎన్నికల ప్రచార సభల్లో ఏడ్చి సానుభూతి పొందడం యడియూరప్పకు అలవాటే. ఈ క్రమంలో సీఎం పదవి విషయంలో తన ఆరాటం ఏమీ లేదని, అధిష్టానం సీట్లో ఉండమంటేనే ఉంటానంటూ ఆయన ప్రకటన చేశారు. ఈ వయసులో ఈ టర్మ్ పూర్తి కానివ్వకుండా తనను తొలగిస్తే.. తనపై ఫాలోయర్లలో సానుభూతిని పెంపొందించుకునేందుకు యడియూరప్ప ప్లాన్ అమలు చేస్తున్నారని స్పష్టం అవుతోంది.
ప్రజలు ఎన్నుకుంటే యడియూరప్ప అక్కడ సీఎం కాలేదు. కాంగ్రెస్-జేడీఎస్ లు ఎన్నికల అనంతరం ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూల్చి యడియూరప్ప సీఎం అయ్యారు. అయితే ఆయనను సీఎంగా చేసిన బీజేపీ హైకమాండ్ అక్కడి రాజకీయ వ్యవహారాలను తన కనుసన్నల్లో నడిపిస్తోందనే పేరును తెచ్చుకుంది. ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్న యడియూరప్ప ప్రయత్నం నెరవేరలేదంటే.. పరిస్థితిని సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఇప్పుడు ఆయనను దించేస్తారనే ప్రచారం ఊపందుకుంది.
తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశాలు అంటూ.. యడియూరప్ప హైకమాండ్ కు సంకేతాలు ఇస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. గతంలో కన్నా ఇప్పుడు యడియూరప్ప తనయుడు పొలిటికల్ గా యాక్టివ్ అయ్యాడు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పుకునే బీజేపీ వాళ్లు యడియూరప్ప తనయుడు విజయేంద్రను ఢిల్లీ పిలిపించుకుని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో విజయేంద్ర జోక్యం ఎక్కువగా ఉందని అసమ్మతి వాదులు ప్రచారం చేసి పెడుతున్నారు.
యడియూరప్ప వయసును బట్టి ఈ వయసులో ఆయన మరోసారి తిరుగుబాటు చేయలేకపోవచ్చు. అయితే కులం, వర్గం, వారసత్వ సమీకరణాల ఆధారంగా విజయేంద్ర ఇప్పుడు మరింత పట్టును పెంచుకునేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ యడియూరప్పను దించి మరొకరిని బీజేపీ అధిష్టానం సీఎంగా చేసినా.. వారిని ప్రశాంతంగా పదవిలో పని చేయనిచ్చే అవకాశాలు మాత్రం ఉండవని స్పష్టం అవుతూ ఉంది. విధానాలు.. విధానాలు.. అంటూ మాట్లాడే బీజేపీ ఆరేడేళ్ల అధికార కాలాల్లోనే అరవై యేళ్ల కాంగ్రెస్ కన్నా కంగాళీ రాజకీయాలను అనుసరిస్తున్న వైనం ఇప్పుడు మరింతగా హైలెట్ అవుతోంది.