ఆనందయ్య మందు తయారు చేసినా తొలి ప్రయారిటీ తన నియోజకవర్గ ప్రజలకే అన్నారు. ఇతర ప్రాంతాల వారు ఎంత ఒత్తిడి తెచ్చినా, భారీ మొత్తం ఆఫర్ చేసినా కుదరదన్నారు. డబ్బులకు ప్రయారిటీ ఇవ్వలేదు, రాష్ట్రవ్యాప్తంగా ఫేమస్ అయిపోవాలనుకోలేదు. దీనికి రివర్స్ లో ఉంది ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహారం.
మేకిన్ ఇండియా వ్యాక్సిన్లను మన అవసరాలు తీరకముందే విదేశాలకు ఎగుమతులు చేశారు. ఉదారవాది అనే క్రెడిట్ కోసం ఆయన భారత ప్రజల జీవితాల్ని ఫణంగా పెట్టారు. ఎవరో కార్పొరేట్ కంపెనీల నిర్వాహకులు ఈ పనిచేశారంటే లాభాల కోసం అనుకోవచ్చు. కానీ దేశ ప్రధాని మోదీ అంతర్జాతీయ సమాజంలో తన పేరు ప్రతిష్టల కోసం చేసిన ఈ పని వల్ల ఇప్పుడు రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి.
ఆనందయ్య లోకల్ థియరీ..
ఆయుర్వేదం మందు తయారు చేస్తున్న ఆనందయ్య ప్రభుత్వం అనుమతి వచ్చాక ఆ పని మొదలు పెట్టారు. ఈరోజు నుంచి కృష్ణపట్నం పోర్ట్ లో దీని పంపిణీ మొదలవుతుంది. అయితే ముందుగా తాను పుట్టి పెరిగిన సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు దీన్ని అందిస్తానని, ఆ తర్వాత మిగతా ప్రాంతాలకు సరఫరా చేస్తామంటున్నారు.
నేతలు, అధికారుల సహాయ సహకారాలున్నా ఉచితంగానే ఈ పంపిణీ ఉంటుందని స్పష్టం చేశారు. వాస్తవానికి ఆనందయ్యకు వచ్చిన క్రేజ్ చూస్తే.. రాష్ట్రంలో ఏదో ఒక కమర్షియల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని, మందుకి రేటు ఫిక్స్ చేసి మార్కెట్లోకి వదిలితే మంచి డిమాండ్ ఉండేది. కానీ లోకల్ ప్రయారిటీ చూసుకున్నారు ఆనందయ్య.
మోదీ ఇంటర్నేషనల్ థియరీ..
కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయన్న సమయంలో విదేశాలన్నీ ముందుగానే కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. పెద్ద మొత్తం ఆర్డర్ ఇచ్చి, అవసరమైన ఆర్థిక సాయాన్ని ముందుగానే చేశాయి. కానీ భారత్ మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకుంది. తొలుత వ్యాక్సిన్ ని విశ్వసించకపోయినా, రెండో స్టేజ్ వచ్చాక దాని అవసరం బాగా అర్థమైంది. అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది.
ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శిస్తున్నా.. అంతర్జాతీయ అవసరాల మేరకే వ్యాక్సిన్ ఎగుమతి చేశామని సమర్థించుకున్నారు మోదీ. 'తనను మాలిన ధర్మం..' అన్నట్టు.. మన అవసరాలు గాలికి వదిలేసి అంతర్జాతీయ సమాజంలో పేరు కోసం ప్రయత్నించారు మోదీ. ఇప్పుడు రాష్ట్రాల నుంచి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారు.
ఇప్పటికీ మోదీ ప్రభుత్వం తమ తప్పు ఒప్పుకోవడం లేదు. విదేశీ వ్యాక్సిన్ల అనుమతుల విషయంలో ఉదారత ప్రదర్శించడం లేదు. రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లినా.. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్లే ఒక్క కంపెనీ కూడా ముందుకు రావడంలేదు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్రం సరఫరా చేయదు, విదేశాల నుంచి కొనుక్కుందామనుకున్న రాష్ట్రాలను కండిషన్ల పేరుతో అడ్డుకుంటోంది.
వ్యాక్సినేషన్ స్పీడ్ ఇలాగే ఉంటే.. వచ్చే ఏడాదికి కూడా టీకా ప్రక్రియ టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం లేదని గణాంకాలు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం 2021 డిసెంబర్ నాటికి భారత్ మొత్తం వ్యాక్సినేషన్ పూర్తవుతుందని గొప్పలు చెబుతున్నారు.