చెవిరెడ్డి చొర‌వ‌…మిగిలిన ఎమ్మెల్యేల్లో ఏదీ?

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌న నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఎందాకైనా వెళ్తార‌నే పేరుంది. ఈ క్ర‌మంలో త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌తి ఒక్క‌రికీ…

చంద్ర‌గిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌న నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల కోసం ఎందాకైనా వెళ్తార‌నే పేరుంది. ఈ క్ర‌మంలో త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కరోనా మ‌హ‌మ్మారి నుంచి ప్ర‌తి ఒక్క‌రికీ విముక్తి క‌లిగించేందుకు ఆయ‌న చూపుతున్న చొర‌వ ప్ర‌శంస‌లు అందుకుంటోంది. 

నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నానికి చెందిన ఆనంద‌య్య త‌యారు చేస్తున్న ఆయుర్వేద మందు క‌రోనాను క‌ట్ట‌డి చేస్తుందా? లేదా? అనేది త‌ర్వాతి చ‌ర్చ‌. ప్ర‌జ‌ల కోసం ఆయ‌న నిబ‌ద్ధ‌త‌తో ముందుకొచ్చిన తీరు స్ఫూర్తిదాయ‌కం.

ఆ మందు వాడితే కరోనా న‌య‌మ‌వుతుంద‌నే బ‌ల‌మైన న‌మ్మ‌కం, విశ్వాసం ప్ర‌జ‌ల్లో ఉంది. దాని వ‌ల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేవ‌ని ఆయుర్వేద నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ఒక్క కంటి చుక్క‌లు త‌ప్ప మిగిలిన అన్ని ర‌కాల మందుల పంపిణీకి జ‌గ‌న్ స‌ర్కార్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ క్ర‌మంలో ఆనంద‌య్య మందుపై మొదటి నుంచి ఆస‌క్తి చూపుతున్న చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి త‌న నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో చంద్ర‌గిరిలో ఆనంద‌య్య మందు త‌యారీకి ఆయ‌న ముందుకొచ్చారు. ఆనంద‌య్య కుమారుడు శ్రీ‌ధ‌ర్‌, శిష్యుల స‌హ‌కారంతో మందు త‌యారీని చెవిరెడ్డి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి మాట్లాడుతూ ఆనందయ్య మందును ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.

కరోనా రాకుండా, శరీరంలో రోగ నిరోధకశక్తి పెంచే విధంగా, బ్లాక్‌ ఫంగస్‌ వంటి వాటిని నియంత్రించే ప్రివెంటివ్‌ (పి) మందు మాత్రమే చంద్ర‌గిరిలో త‌యారు చేస్తున్న‌ట్టు చెప్పుకొచ్చారు.  

నియోజకవర్గంలోని 1.6 లక్షల కుటుంబాల్లో 5.20 లక్షలమంది ప్రజలకు ఈ మందును మ‌రో రెండు రోజుల్లో ఉచితంగా ఇవ్వనున్నట్లు చెవిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ప్రజలు స్వచ్ఛందంగా త‌మ‌త‌మ గ్రామాల్లో లభించే వేప, మారేడు, బుడ్డ బుడవ ఆకులు, కొండపల్లేరు కాయలు, తెల్లజిల్లేడు పూలు తీసుకొచ్చారని తెలిపారు. మరో 11 రకాల ముడి సరుకులను సమకూర్చామన్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న నియోజ‌క వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు చెవిరెడ్డి సొంతంగా మందు త‌యారు చేసి, రెండు రోజుల్లో పంపిణీ చేస్తున్నార‌నే స‌మాచారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ప్ర‌చార‌మ‌వుతోంది. దీంతో త‌మ ఎమ్మెల్యేలు అలా చేయ‌రెందుకు? అనే ప్ర‌శ్న వెల్లువెత్తుతోంది.