ప్రస్తుతం రవితేజ హీరోగా ఖిలాడీ అనే సినిమా చేస్తున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. అయితే ఈ సినిమా తన డ్రీమ్ ప్రాజెక్టు కాదంటున్నాడు. తను చేయాలనుకున్న సినిమా వేరే ఒకటి ఉందని చెప్పుకొచ్చాడు.
“ఓ మంచి లవ్ స్టోరీ చేయాలనుకున్నాను. ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అది నా డ్రీమ్ ప్రాజెక్టు. ఆ కథ గురించి నితిన్ తో కూడా చర్చించాను. రాక్షసుడు సినిమా సెట్స్ పై ఉన్న టైమ్ లో మా మధ్య డిస్కషన్ జరిగింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు.”
ఇలా తన డ్రీమ్ ప్రాజెక్టు ఇంకా సెట్స్ పైకి రాలేదంటున్నాడు దర్శకుడు రమేష్ వర్మ. రాక్షసుడు హిట్ అయిన తర్వాత తన డ్రీమ్ ప్రాజెక్టును మరోసారి సెట్స్ పైకి తీసుకురావాలని గట్టిగా ప్రయత్నించినప్పటికీ.. ఇతర కమిట్ మెంట్స్ వల్ల కుదర్లేదంటున్నాడు. మరోవైపు ఖిలాడీ సినిమా పుకార్లపై కూడా స్పందించాడు ఈ డైరక్టర్.
“ఖిలాడీ సినిమాను అంతా రీమేక్ అంటున్నారు. అది రీమేక్ కాదు. అయితే ఓ తమిళ సినిమాకు దగ్గరగా మా మూవీ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ తమిళ సినిమా ఇంటర్వెల్ కు, ఖిలాడీ ఇంటర్వెల్ బ్యాంగ్ కు చాలా దగ్గర పోలిక ఉంటుంది. దీనికి సంబంధించి ఆ తమిళ సినిమా నిర్మాతతో నేను మాట్లాడాను. ఇది తప్పితే, మిగతాదంతా చాలా ఫ్రెష్ గా ఉంటుంది.”
ఇలా ఖిలాడీ సినిమా ఓ తమిళ సినిమాకు దగ్గరగా ఉంటుందని చెబుతూనే.. దాన్ని స్ట్రయిట్ మూవీ అంటున్నాడు రమేష్ వర్మ. మరోవైపు క్రాక్ హిట్టవ్వడంతో ఖిలాడీలో మార్పుచేర్పులు చేశారనే ఊహాగానాల్ని కూడా కొట్టేశాడు. క్రాక్ హిట్టయ్యే టైమ్ కు ఖిలాడీ 40శాతం షూటింగ్ పూర్తయిందని, ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టంచేశాడు.