కరోనా వ్యాక్సినేషన్ పై విశ్వాసాన్ని పెంచే మాట చెబుతోంది యూకే. యూకే పరిధిలో ఇప్పుడు కరోనా కారణ మరణాలు జీరో స్థాయికి చేరాయి. రెండు రోజుల కిందట మొత్తం యూకే పరిధిలో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
ఒక దశలో కరోనాతో బాగా ఇక్కట్లు పడింది మొత్తం యూకే. ఈ ఏడాది జనవరి సమయంలో కూడా యూకే పరిధిలో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. ప్రపంచంలోనే కరోనా కారణంగా ఎక్కువ మరణాలు నమోదు అయిన దేశాల్లో ఒకటిగా నిలిచింది యూకే.
అలాంటి చోట ఇప్పుడు కరోనా కారణ రోజువారీ మరణాల సంఖ్య జీరో స్థాయికి రావడం అక్కడ ఊరటను ఇచ్చే అంశంగా మారింది. గత వారంలో యూకే పరిధిలో రోజుకు పది లోపు స్థాయిలో మాత్రమే కరోనా కారణ మరణాలు నమోదయ్యాయి. రోజువారీగా కేసుల సంఖ్య రెండు మూడు వేల స్థాయిలో నమోదవుతున్నా.. మరణాల సంఖ్య బాగా తగ్గింది.
దీనికి కారణం.. వ్యాక్సినేషనే అని కూడా అక్కడి ప్రభుత్వం చెబుతోంది. వ్యాక్సినేషన్ గొప్పగా పని చేస్తూ ఉండటం వల్లనే కరోనా పై తమ విజయం సాధ్యమైందని అక్కడి మంత్రులు ప్రకటిస్తున్నారు. వైద్య నిపుణులు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకూ యూకేలో అక్కడి జనాభాకు తగిన రీతిలో భారీ స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగింది.
కనీసం 75 శాతం జనాభాకు ఒక డోసు కరోనా వ్యాక్సినేషన్ జరిగింది. వారిలో దాదాపు 60 శాతం మందికి రెండో డోసు కూడా వేశారట. ఈ నేపథ్యంలో కరోనా ప్రభావం బాగా తగ్గిందని అక్కడి ప్రభుత్వం ధ్రువీకరిస్తోంది. కరోనాను ఏదైనా దేశం జయించాలంటే వ్యాక్సినేషనే పరిష్కారం అని యూకే ఉదాహరణ స్పష్టం చేస్తోంది.
ఎంత ఎక్కువ శాతం జనాభాకు వ్యాక్సినేషన్ జరిగితే కరోనా నుంచి అంత స్థాయిలో ప్రమాద తీవ్రత తగ్గిపోతున్నట్టే అని స్పష్టం అవుతూ ఉంది. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముక్కుతూ మూలుగుతూ సాగుతూ ఉంది. గత వారంలో తొలి సారి రోజుకు 30 లక్షల వ్యాక్సిన్ డోసులు వేసే వరకూ పరిస్థితి వచ్చింది.
దేశ జనాభాకు వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్ పూర్తి చేయాలంటే.. రోజుకు కోటికి పైగా డోసులను వేయాల్సి ఉంది. ఆ టార్గెట్ కు కూడా ఇప్పుడప్పుడే చేరే పరిస్థితి లేదని కేంద్రం స్వయంగా ధ్రువీకరిస్తోంది. ఆగస్టు నాటికి ఆ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగొచ్చని మాత్రం చెబుతున్నారు. మరి అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో!