సినిమాను రూపొందించడం కాదు… విడుదల చేసుకోవడమే అసలైన కథ అని అంటారు సినీ ఇండస్ట్రీలోని పరిస్థితులను పరిశీలిస్తున్న వాళ్లు. ఒక్క తెలుగు ఇండస్ట్రీలోనే విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాలు వెయ్యి వరకూ ఉన్నాయని.. ఇండస్ట్రీలోని వ్యక్తులే చెబుతారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతియేటా వందకు పైగా సినిమాలు విడుదల అవుతాయని అనుకుంటే.. కనీసం ఆరేడేళ్లే విడుదలలకు సరిపడినన్ని సినిమాలు విడుదల ఆగిపోయిన దశలో ఉన్నాయి. ఆ సినిమాలు రూపొంది, అన్నిరకాల హంగులూ సమకూర్చుకుని.. విడుదల మోక్షం కోసం ఎదురుచూస్తూ ఉన్నాయని సినీ ఇండస్ట్రీలోని వ్యక్తులు చెబుతూ ఉంటారు.
తాజాగా రాజశేఖర్ సినిమా ఒకటి విడుదలకు రెడీ అనే ప్రకటన వచ్చింది. మార్చి పదిహేనో తేదీన ఆ సినిమా విడుదల కానున్నదట. వాస్తవానికి అది ఇప్పటి సినిమా కాదు. ఎనిమిదేళ్ల కిందట షూటింగ్ మొదలైన సినిమా. దాదాపు అప్పుడే షూటింగును పూర్తి చేసుకుంది కూడా. అయితే రాజశేఖర్‌కు సరైన హిట్ లేకపోవడంతో.. ఆ సినిమా విడుదల కష్టం అయ్యింది. ఒక దాని తర్వాత మరో సినిమా రావడం, ఫెయిల్యూర్ అవుతూ ఉండటంతో.. వాటి ప్రభావం వల్ల అర్జున అనే ఈ సినిమా విడుదల ఆగిపోయింది.
మూడేళ్ల కిందట ఈ సినిమా విడుదల గురించి ప్రకటన వచ్చింది. అయితే.. అప్పుడు కూడా విడుదలకు మోక్షం లభించలేదు. విడుదల ఆగిపోయింది. కొన్నాళ్ల కిందట రాజశేఖర్ కెరియర్ మళ్లీ కొంచెం పుంజుకుంది. పీఎస్వీ గరుగవేగతో మళ్లీ కొంచెం కళ వచ్చింది. అలాగే ఈ మధ్య మరో సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. దీంతో ఇప్పుడు మళ్లీ ఆగిపోయిన 'అర్జున'ను తెరమీదకు తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. త్వరలోనే విడుదల అంటున్నారు. మరి ఇప్పటికైనా దానికి విడుదల మోక్షం లభిస్తుందో లేదో చూడాల్సి ఉంది.
ఒక్క రాజశేఖర్‌కు సంబంధించే ఇతర సినిమాలు కూడా అంతా పూర్తై విడుదల ఆగిపోయినవి ఉన్నాయి! అలాంటి వాటిల్లో మరోటి 'పట్టపగలు' అనే సినిమా మరోటి. ఇది కూడా ఆరేడేళ్ల కిందటి సినిమానే. వర్మ కంపెనీ ఈ సినిమాను రూపొందించింది. హారర్ సినిమా. అప్పట్లో వర్మ కంపెనీపై వరసగా ఏదో ఒక సినిమా వచ్చేది. అలాంటి వాళ్లో ఈ 'పట్టపగలు' కూడా ఒకటి. అప్పట్లో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేశారు. బహుశా యూట్యూబ్‌లో అలాగే ఉంటుంది. అయితే ఆ సినిమా విడుదల మాత్రంకాలేదు.
హారర్ సబ్జెక్టు అంటే ఎంతోకొంత క్యూరియాసిటీ ఉంటుంది. ఇప్పుడు అలాంటి సినిమాల సీజన్ కూడా కొనసాగుతూ ఉంది. కొన్నేళ్లుగా అలాంటి సినిమాలు బోలెడన్ని వస్తూ ఉన్నాయి. అయితే రాజశేఖర్ – రామ్‌గోపాల్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ఆ సినిమా మాత్రం విడుదలకు నోచుకోవడం లేదు. బహుశా ఇక ఆ సినిమా విడుదల కానట్టేనేమో. అలాగాక.. రాజశేఖర్ కెరీర్ మళ్లీ ఊపు మీదకు వస్తే.. ఆ సినిమా విడుదల అయినా కావొచ్చు!
ఇక వర్మ కంపెనీలో అలాంటి సినిమాల డేటా చాలానే ఉంది. వర్మ బోలెడన్ని సినిమాలను అనౌన్స్ చేస్తూ ఉంటాడు. వాటిల్లో కొన్ని టైటిల్ లోగో వరకూ మాత్రమే వచ్చి ఆగిపోతూ ఉంటాయి. ఆ తర్వాత మరికొన్ని సినిమాలు ట్రైలర్ల వరకూ వచ్చి ఆగుతాయి. ఆపై ఇంకొన్ని సినిమాలు షూటింగ్ కూడా చేసుకుంటాయి. అలా షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా సదరు సినిమాలు విడుదల అవుతాయనే నమ్మకాలు ఉండవు.
ఆర్జీవీ కొన్నేళ్ల కిందట అనౌన్స్ చేసిన వివిధ సినిమాల్లో కొన్ని షూటింగ్ పూర్తి చేసుకున్నాయి.వాటికి దర్శకత్వం పేరు వర్మదే పడినా.. వాటిని వర్మ అసిస్టెంట్లు, అతడి ఆస్థానంలో పనిచేసే వాళ్లు.. రూపొందించారు. జేడీ చక్రవర్తి కూడా ఒక సినిమాను చుట్టేశాడట. అయితే.. అది కూడా విడుదలకు నోచుకోలేదు. బహుశా అలాంటి సినిమాలను విడుదల చేయాలనే ఆలోచన కూడా వర్మకు ఏమీ కనిపించడం లేదు! ఇక సీనియర్ దర్శకుడు వంశీ సినిమా ఒకటి కూడా అలాగే విడుదల విషయంలో ఇబ్బందులను ఎదుర్కొని, చివరకు వచ్చి వెళ్లిపోయింది. ఆ సినిమా పేరు.. మొదట ఏదో అనౌన్స్ చేశారు.
'తను మొన్ననే వెళ్లిపోయింది'అంటూ ఏదో ఒక టైటిల్‌ను ప్రకటించారు. ఆ టైటిల్‌తో ఆ సినిమా రెండు మూడేళ్లు వార్తల్లో నిలిచింది. చివరకు ఆ టైటిల్‌ను 'వెన్నెల్లో హాయ్ హాయ్'గా క్యాచీగా మార్చారు. అయినా విడుదల అనేక వాయిదాలు పడింది. చివరకు ఎలాగో విడుదల చేసుకున్నారు. సరైన ప్రచారం లేకపోవడం, సినిమాలో కూడా అంతేస్థాయి సత్తా ఉండటంతో.. అది అటు నుంచి అటే మాయం అయ్యింది. ఈ మధ్యనే ఆ సినిమాను అమెజాన్లో అప్లోడ్ చేసినట్టుగా ఉన్నారు. అక్కడ దర్శనమిస్తోంది ఆ సినిమా!
ప్రివ్యూస్ పడ్డాకా.. కొన్నినెలలకు విడుదల అయిన సినిమాలు.. అసలు ఆ తర్వాత విడుదలే కాని సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. తనికెళ్ల భరణి దర్శకత్వంలో ఎస్పీబీ, లక్ష్మి ఇద్దరే నటించిన సినిమా 'మిథునం' కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. ప్రయోగాత్మకంగా రూపొందిన ఈ సినిమాకు చాలామంది ఫ్యాన్సే ఉన్నారు. అయితే విడుదలకు ముందు ఈ సినిమా ఎదుర్కొన్న ఇబ్బందులు చాలానే ఉన్నాయి, ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ సినిమా ప్రివ్యూను ప్రెస్‌కు సినిమా వాళ్ల కోసం ప్రదర్శించిన చాన్నాళ్ల తర్వాత ఇది థియేటర్ల వద్దకు వచ్చింది. అభినందనలు పొందింది.
ఏదో లక్ ఉండబట్టి ప్రివ్యూ పడిన కొన్నిరోజుల తర్వాత అయినా ఆ సినిమా థియేటర్ల వద్దకు వచ్చింది. ఆ మాత్రం అవకాశం లేక.. ప్రివ్యూలు పూర్తి చేసుకుని.. ప్రేక్షకుల వ్యూస్‌ను పొందకుండానే పోయిన సినిమాలు బోలెడన్ని ఉన్నాయి. అయితే ఒక్కోసారి ఇలా విరామం తర్వాత విడుదల అయిన సినిమాలు సంచలన విజయాలు సాధించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిల్లో శివనాగేశ్వరరావు సినిమా 'పట్టుకోండి
చూద్దాం' ఒకటి. ఆ సినిమాను అయితే డిస్ట్రిబ్యూటర్ల కోసం కొన్ని వందల సార్లు ప్రివ్యూస్ వేశారట. అలా ప్రివ్యూ థియేటర్లలో వందరోజులు పైగా ఆడిన సినిమాగా దాన్ని చెబుతూ ఉంటారు.చివరకు ఎలాగో మోక్షం లభించి ఆ సినిమా విడుదల అయ్యింది. సంచలన విజయం సాధించింది. కామెడీ సినిమాగా సూపర్ హిట్‌గా నిలిచింది. అలాగే తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా చెప్పుకోదగిన శ్రీనువైట్ల సినిమా
'ఢీ' కూడా విడుదలకు ముందు చాలా ఇబ్బందులనే ఎదుర్కొంది. షూటింగ్ పూర్తి.. కొన్నినెలలు గడిచినా.. ఆ సినిమా విడుదలకు మోక్షం లభించలేదు.అప్పటికే విష్ణు కెరీర్‌లో కొన్ని ఫ్లాప్‌లు ఉండటం, అంతకు ముందు శ్రీనువైట్ల కూడా చిరంజీవి 'అందరివాడు'తో అంతగా ఆకట్టుకోలేకపోవడంతో… 'ఢీ' సినిమా విడుదలకు చాలా పాట్లనే పడింది. షూటింగ్ పూర్తై దాదాపు ఏడాదికి ఆ సినిమా విడుదల అయ్యింది. సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది!
ఇక విడుదలలు ఆగిపోవడం అనేది మహామహులకు కూడా తప్పలేదు. మెగాస్టార్ కెరీర్‌లోనే నెవర్ రిలీజ్డ్ సినిమాలు ఉన్నాయి! అయితే ఇప్పటివి కాదులెండి. ఎనభైలలో చిరంజీవి హీరోగా నటించి, షూటింగ్ అంతా పూర్తి అయ్యాకా.. కూడా విడుదలకు నోచుకోని సినిమాలు ఉన్నాయి. అప్పటికే చిరు కెరీర్‌లో కొన్ని హిట్స్ ఉన్నా, హీరోగా గుర్తింపు ఉన్నా.. సదరు సినిమాలు విడుదల కాలేదు. మూడు నాలుగు సినిమాలు అలా పెండింగ్‌లోనే ఉన్నాయని ఒక పాత ఇంటర్వ్యూలో చిరంజీవే చెప్పారు.
మలయాళ స్టార్ హీరో మమ్ముట్టీ తెలుగులో చేసిన ఒక సినిమా కూడా దాదాపుగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాకా.. విడుదల ఆగిపోయింది. ఆ విషయాన్ని ఇప్పటికీ మమ్ముట్టీ మరిచిపోలేదు. ఇటీవల ఆ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక చిన్న సినిమాలు.. కొత్తవాళ్లు.. రూపొందించి విడుదల కాకుండా ఆగిపోయిన సినిమాల పేర్లన్నింటినీ కలిపితే ఆ జాబితా చాంతాడంత అవుతుంది. ప్రత్యేకించి గత ఏడెనిమిదేళ్లలో అలాంటి సినిమాల సంఖ్య గణనీయంగా పెరిగింది. బోలెడన్ని సినిమా పత్రికలకు ప్రకటనల వరకూ వచ్చి కూడా ఆ తర్వాత జాడలేకుండా పోయాయి.
ప్రతివారం జరిగే తంతే ఇది! అలాగే గుర్తింపు ఉన్న తారలతో రూపొందిన సినిమాలూ ఉన్నాయి. జగపతిబాబు, సుమన్, రాజేంద్ర ప్రసాద్ వంటివాళ్లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలు కూడా అనేకం విడుదల ఆగి అడ్రస్ లేకుండా పోయాయి.
హద్దు లేకుండా తెగించిన రాజకీయం!
మెగా మద్ధతు వెనుక మర్మం బయటపెట్టిన నరేష్