ఆర్జీవీ ఇంత హడావుడి చేస్తున్నా, సినిమాలో విషయం వేరుగా వుంటుందని కూడా టాక్ వినిపిస్తోంది. సినిమాలో చంద్రబాబు కన్నా పురంధ్రీశ్వరి, హరికృష్ణ లాంటి చంద్రబాబు అంటే కిట్టని వాళ్లే ఎక్కువగా టార్గెట్ అవుతారని తెలుస్తోంది. సినిమాలో బాలయ్య ప్రస్తావన తక్కువ వుంటుందని తెలుస్తోంది. చంద్రబాబు అలా ఎందుకు చేయాల్సి వచ్చిందన్నది కాస్త క్లారిటీగా చెప్పడం, ఎన్టీఆర్ వైపు నుంచి చంద్రబాబును దోషిగా చూపించడం తప్ప, నేరుగా చంద్రబాబు తప్పు అనేలా పెద్దగా వుండదని తెలుస్తోంది.
పురంధ్రీశ్వరి, హరికృష్ణ ఇలాంటి ఫ్యామిలీ మెంబర్లను టార్గెట్ చేసినా పెద్దగా ఎవ్వరూ పట్టించుకోరు. సినిమాకు అడ్డంపడరు. అదే వర్మ స్ట్రాటజీగా కనిపిస్తోంది. అందుకే సినిమా విడుదలయిన తరువాత చూసి చెప్పండి అనే అంటున్నారని, గతంలో వంగవీటి సినిమాను కూడా జనం అనుకునే మాదిరిగా తీయలేదని, రంగాను ఎవరు చంపించారు అన్నది చెప్పనేలేదని గుర్తుచేస్తున్నారు.
'లక్ష్మీస్' ను పట్టించుకోవద్దు-బాబు?
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు తాజా సంచలనం. ఈ సినిమాను తెలుగుదేశం పార్టీ లేదా, ఎన్టీఆర్ కుటుంబీకులు ఆపేస్తారా? లేదా ఆపే ప్రయత్నం చేస్తారా? అన్నది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా వుంది. కానీ విశ్వసనీయ వర్గాల బోగట్టా వేరుగా వుంది. ఈ సినిమాను కానీ, ఈ సినిమా వ్యవహారాలను కూడా అస్సలు పట్టించుకోవద్దని చంద్రబాబు నేరుగా నందమూరి కుటుంబీకులకు సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
జరిగినవి, అన్నీ జనాలకు తెలుసు అని, ఎవరు ఏమిటన్నది కూడా జనాలకు తెలుసు అని, ఏది ఎందుకు జరిగిందన్నది కూడా తెలుసు అని. అందుకే అనవసరంగా దాన్ని పట్టించుకుని పెద్దది చేసే ప్రయత్నం చేయవద్దని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.