కోవిడ్ నాలుగో వేవ్ వస్తుందేమోనని ఆందోళన చెందుతున్న సమాజానికి తెలంగాణ ప్రజారోగ్య సంచాలకుడు (డీహెచ్) శుభవార్త చెప్పారు. కొత్త వేరియంట్ వస్తే తప్ప ప్రపంచాన్ని పట్టి పీడించిన కోవిడ్ అనే మహమ్మారి కథ ముగిసినట్టే అన్నారు. కోవిడ్ నుంచి బయటపడ్డామన్నారు. తాజాగా సీజనల్ వ్యాధులతో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
గత ఆరు వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరిగిందన్నారు. అయితే కరోనా గురించి భయపడాల్సిన పనిలేదన్నారు. ఇది ముగింపు దశకు చేరిందన్నారు. సాధారణ జలుబు, జ్వరం లక్షణాలుంటాయన్నారు. కోవిడ్ కూడా సీజనల్ వ్యాధిగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. కోవిడ్ లక్షణాలుంటే కేవలం ఐదు రోజులే క్వారంటైన్‌లో వుండాలన్నారు.
గత వారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆహారం, నీళ్లు కలుషితం కాకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని హెచ్చరించారు. పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,184 డెంగీ కేసులు నమోదైనట్టు ఆయన చెప్పారు.
హైదరాబాద్‌లో 516, మిగితా కేసులు ఇతర జిల్లాల్లో నమోదయ్యాయని ఆయన చెప్పారు. రాష్ట్రంలో మలేరియా కేసులు కూడా నమోదవుతున్నాయని డీహెచ్ తెలిపారు. ఈ ఏడాది టైఫాయిడ్ కేసులు కూడా ఎక్కువగా నమోదు అవుతున్నాయన్నారు.
ప్రజలు ‘ఫ్రై డే – డ్రై డే’ కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజలు సరైన ఆహారం, మంచినీరు తీసుకోవాలని కోరారు. ఆహారం వేడిగా ఉండేలా చేసుకోవాలన్నారు. గోరువెచ్చటి నీటిని తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలన్నారు. జలుబు, జ్వరం, విరేచనాలతో బాధపడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. చిన్న నొప్పులే కదా అని అజాగ్రతగా వుండి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు.
జ్వరం వచ్చినప్పడు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలని తెలిపారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాధుల టెస్ట్ కిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జలుబు, జ్వరం ఉంటే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని శ్రీనివాస్‌రావు కోరారు.