విలువ ఇవ్వని పార్టీకి వీడ్కోలు పలుకుతాడా?

ఏపీలో జనసేన-బీజేపీ దోస్తీపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఈ స్నేహం కలకాలం ఉండదని రాజకీయ పండితులు ఊగాగానాలు చేస్తూనే ఉన్నారు. ఇవి పూర్తిగా అబద్దమని కొట్టి పారేయలేం. పొత్తుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు.…

ఏపీలో జనసేన-బీజేపీ దోస్తీపై ఎప్పటినుంచో సందేహాలు ఉన్నాయి. ఈ స్నేహం కలకాలం ఉండదని రాజకీయ పండితులు ఊగాగానాలు చేస్తూనే ఉన్నారు. ఇవి పూర్తిగా అబద్దమని కొట్టి పారేయలేం. పొత్తుపై రెండు పార్టీలకు చిత్తశుద్ధి లేదు. ఏ పార్టీకా పార్టీ తామే గొప్ప అనే భావనలో ఉన్నాయి. తామే అధికారంలోకి వస్తామని బీజేపీ చెబుతుంటే, తామే అధికారంలోకి వస్తామని జనసేన అంటోంది.

దీంతో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. పార్టీ పరంగా చూసుకుంటే రెండు పార్టీల పరిస్థితి దొందూ దొందే అన్నట్లుగా ఉంది. ఎదుగు బొదుగూ లేదు. రాష్ట్ర బీజేపీ మోడీని నమ్ముకుంటే, జనసేన పవన్ సినిమా ఇమేజ్ ను నమ్ముకుంది. రాష్ట్రంలో  అధికార పార్టీకి వ్యతిరేకంగా రెండు పార్టీలు ఒక తాటిపై నడిచే అవకాశాలు కనిపించడంలేదు. గతంలో పవన్ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయి భంగపడిన తరువాత ఆ పార్టీలను వదిలేశాడు.

ఒకప్పుడు బీజేపీని నానా తిట్లు తిట్టిన పవర్ స్టార్ చివరకు ఆ పార్టీతోనే పొత్తులో ఉన్నాడు. ఇప్పుడు ఆయన టీడీపీ వైపు చూస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. అయితే బాబు గానీ, పవన్ గానీ బయటపడటం లేదు. అయితే ఒకటి మాత్రం వాస్తవం. బీజేపీ పవన్ కు విలువ ఇవ్వడంలేదు. భాగస్వామ్య పార్టీగా గౌరవించడంలేదు. బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా అలాగే ఉంది. ఈ నేపథ్యంలో రెండు పార్టీల పొత్తు ఎక్కువ కాలం ఉండకపోవొచ్చనే ఊహాగానాలు ప్రబలుతున్నాయి. జనసేన నాయకులు కొందరు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలను బలపరిచేవిగా ఉన్నాయి.

జనసేన అధికారంలోకి వస్తుందని, పవన్ సీఎం అవుతాడని అంటున్నారు. అంటే జనసేన ఒంటరిగానే పోటీ చేసి అధికారంలోకి వస్తుందనే అర్ధం వచ్చేలా మాట్లాడుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ జ‌రిగిన‌ప్పుడు పొత్తుల‌కు సిద్ధ‌మేన‌ని, వైసీపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని, కేంద్రం నుంచి రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామ‌ని పవన్ ప్రకటించాడు. కానీ ఇంత‌వ‌ర‌కు కేంద్రం నుంచి ఎటువంటి రోడ్‌మ్యాప్ అంద‌లేదు.

కేంద్ర బీజేపీ పెద్ద‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌నీసం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డానికి కూడా నిరాక‌రిస్తుండ‌టం ఆయ‌న్ను మ‌న‌స్తాపానికి గురిచేస్తోంద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ బీజేపీకి స్నేహ‌హ‌స్తాన్ని అందించాడు. అయితే వైసీపీని గ‌ద్దె దించాల‌నే త‌న ల‌క్ష్యానికి రాష్ట్ర బీజేపీ నేత‌లు సహకరించకపోవడం, కొంద‌రు నేత‌లు లోపాయికారీగా అధికార పార్టీకి స‌హ‌క‌రిస్తున్నారంటూ ప‌వ‌న్ బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక త‌ర్వాత బీజేపీ, జ‌న‌సేన అంటీ ముట్ట‌న‌ట్లుగా వ్యవహరిస్తున్నాయి.

దూరంపెరుగుతోందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కరోనావల్ల తమ మధ్య 'భౌతిక దూరం' పెరిగిందని, అది తగ్గగానే ఈ దూరం కూడా తగ్గిపోతుందని అన్నాడు పవన్. ''కరోనా తగ్గేదిలేదు.. ఈ దూరం కూడా తగ్గేది లేదు'' అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

రాజ‌మండ్రిలో ''గోదావ‌రి గ‌ర్జ‌న'' పేరుతో జ‌రిగిన స‌భ‌కు బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌ర‌య్యారు. దీనికి ప‌వ‌న్‌కు ఆహ్వానం అంద‌లేదు. భీమ‌వ‌రంలో ప్ర‌ధాన‌మంత్రి స‌భ జ‌రిగింది. దీనికికూడా ఆహ్వానం అంద‌లేదు. ఈ సభకు ఏనాడో రాజకీయాలకు స్వస్తి పలికిన చిరంజీవిని పిలిచారు. 

పవన్ ను బీజీపీ అవమానిస్తోందన్న భావన జనసేన పార్టీ నాయకుల్లో బాగా పేరుకుపోయింది. పవన్ కూడా అదే అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తోంది. అక్టోబ‌రు 5వ తేదీన విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌కు ప‌వ‌న్ క‌ల్య‌ణ్ శ్రీ‌కారం చుట్టబోతున్నాడు. అదేరోజు బీజేపీతో  మిత్ర‌బంధాన్ని తెగ‌తెంపులు చేసుకుంటార‌ని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే టీడీపీతో బంధం ఏర్పడుతుందేమో.