పది లక్షల కొబ్బరికాయలు పగలాల్సిందే…?

ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ దివ్య క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణం ఈ రోజు. విశాఖలోని సింహాచలం కొండ చుట్టూ ఉన్న మొత్తం 32 కిలోమీటర్ల దూరాన్ని భక్తులు కాలి నడక…

ఉత్తరాంధ్రాలో సుప్రసిద్ధ దివ్య క్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి గిరి ప్రదక్షిణం ఈ రోజు. విశాఖలోని సింహాచలం కొండ చుట్టూ ఉన్న మొత్తం 32 కిలోమీటర్ల దూరాన్ని భక్తులు కాలి నడక ద్వారా నడచి గిరి ప్రదక్షిణం చేస్తారు. ఇది ఏపీలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం. దీని కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు.

ఇక గిరి ప్రదక్షిణం మొదలుపెట్టే భక్తులు సింహాచలం కొండ దగ్గర తొలి పావంచా వద్ద కొబ్బరి కాయ కొట్టి తమ‌ పాదయాత్రకు శ్రీకారం చుడతారు. గిరి ప్రదక్షిణ ముగిసిన తరువాత మ‌రో కొబ్బరి కాయ కొడతారు. 

ఇలా దాదాపు గా అయిదు లక్షల మంది భక్తులు ఈసారి గిరి ప్రదక్షిణకు హాజరవుతున్నారు అన్న అంచనా ఉంది. అంటే మొత్తం పది లక్షల కొబ్బరికాయలు ఒక్క రోజే పగులుతాయన్న మాట.

ఆషాడ శుద్ధ పౌర్ణమికి ఒక రోజు ముందు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం పున్నమి ఘడియలలో అప్పన్న‌ స్వామివారిని దర్శించుకుంటే తమ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇలా అనూచాణంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. చివరిసారిగా 2019లో గిరి ప్రదక్షిణ జరిగింది. గత రెండేళ్ళుగా కరోనా కారణంగా భక్తులకు  అనుమతి ఇవ్వలేదు.

దీంతో ఈసారి లక్షలాదిగా భక్తులు తరలివస్తారని దేవస్థానం వర్గాలు చెబుతున్నాయి. దానికి తగిన ఏర్పాట్లతో సర్వం సిద్ధం చేశారు. ఈ గిరి ప్రదక్షిణం విశాఖ నగరం మొత్తం సాగుతుంది. 

ఇక భక్తులు కొట్టే కొబ్బరి కాయలను వేలం వేస్తేనే మూడేళ్ళ క్రితం ఇరవై లక్షల ఆదాయం వచ్చింది. ఈసారి దానికి మించి  రావచ్చు అని మరో అంచనా. చీమల దండుగా. వెల్లువలా కొండ చుట్టూ సిటీ చుట్టూ భక్తులు వరదలా కదిలి వచ్చే గిరి ప్రదక్షిణ సన్నివేశం నిజంగా కనుల విందు గానే చెప్పాలి.