ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ చాలామంది జీవితాల్ని ప్రభావితం చేసింది. బాలయ్య కొత్త సినిమా ప్రకటించడానికే వెనకాడుతున్నారు. తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లు మింగలేక కక్కలేక దిగులుపడ్డారు. ఇవాళ కాకపోతే రేపు బాలకృష్ణ కోలుకుంటారు, కొత్త సినిమా చేస్తారు.. జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే బయ్యర్లు కూడా మరో సినిమాతో గట్టెక్కే అవకాశాలున్నాయి. అసలైన దెబ్బ క్రిష్ పైనే పడింది.
అప్పటివరకూ తెలుగునాట క్రిష్ కు ఉన్న పేరు మొత్తం బయోపిక్ దెబ్బకి తుడిచిపెట్టుకుపోయింది. బాలకృష్ణ వంటి పెద్ద హీరోతో వరుసపెట్టి సినిమాలు చేసిన క్రిష్.. అసలిప్పుడు ఏ సబ్జెక్ట్ టచ్ చేయాలి, ఎవరితో సినిమా చేయాలి, అసలెందుకు సినిమా తీయాలనే ఆలోచనలో పడిపోయారు. అటు బాలీవుడ్ కి వెళ్దామన్నా అక్కడ మణికర్ణిక రూపంలో కంగనా రనౌత్ భయపెడుతోంది.
సగంలో మణికర్ణికను వదిలేసి వచ్చిన క్రిష్.. సైలెంట్ గా ఉండకుండా “నా బంగారం నా బంగారం” అంటూ రిలీజ్ టైమ్ లో చేసిన అతి ఆయన కొంప ముంచింది. కంగన సహా ఆమె సోదరి.. అందరూ కలసి ఓ రౌండ్ వేసుకోవడంతో బాలీవుడ్ లో కూడా తలెత్తుకోలేని పరిస్థితి. అక్షయ్ కుమార్ వంటి స్టార్ హీరోతో సినిమా చేసి హిట్ కొట్టినా కూడా క్రిష్ కు ఫలితం లేకుండాపోయింది.
దీంతో ఈ దర్శకుడు పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడని సమాచారం. ఒకటి రెండు సినిమా ప్రపోజల్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించాడట. ప్రస్తుతానికి కాస్త గ్యాప్ తీసుకోవాలనే ఉద్దేశంలో క్రిష్ ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక హీరోలు, స్టార్ డమ్, బయోపిక్ లు అని పెట్టుకోకుండా తనదైన జానర్ లో మానవ సంబంధాల నేపథ్యంలోనే కొత్త కథ తయారుచేసుకోబోతున్నాడట క్రిష్. ఇతడి నుంచి ప్రేక్షకులు కోరుకునేది కూడా ఇదే.