పేర్ని నాని ఊచ‌కోత‌

ప్ర‌త్య‌ర్థుల‌ను చెడుగుడు ఆడ‌డంలో మాజీ మంత్రి పేర్ని నాని త‌ర్వాతే ఎవ‌రైనా. వ్యంగ్యం, హాస్యం క‌లిపి ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను చావ‌బాదుతుంటారు. ఇవాళ పేర్ని నాని చేతిలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీ జాతీయ నాయ‌కుడు స‌త్య‌కుమార్…

ప్ర‌త్య‌ర్థుల‌ను చెడుగుడు ఆడ‌డంలో మాజీ మంత్రి పేర్ని నాని త‌ర్వాతే ఎవ‌రైనా. వ్యంగ్యం, హాస్యం క‌లిపి ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌ను చావ‌బాదుతుంటారు. ఇవాళ పేర్ని నాని చేతిలో జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బీజేపీ జాతీయ నాయ‌కుడు స‌త్య‌కుమార్ బ‌లి అయ్యారు. ముఖ్యంగా స‌త్య‌కుమార్ ఎవ‌రో త‌న‌కు తెలియ‌దంటూనే ఆకులో అర‌టి పండుగా సంబోధిస్తూ పేర్ని నాని గాలి తీశారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో 95 శాతం హామీలను అమలు చేసిన ప్రభుత్వం త‌మ‌ద‌ని చెప్పుకొచ్చారు. చెప్పిన హామీలనే కాదు.. చెప్పనివి కూడా సీఎం జగన్‌ అమలు చేశారన్నారు.

పవన్‌ కల్యాణ్‌ది వీకెండ్‌ ప్రజాసేవ అంటూ పేర్ని నాని వెట‌క‌రించారు. ‘పక్షానికో సారి సెలవు రోజు పవన్‌కల్యాణ్‌ ప్రజాసేవ.. పవన్‌.. షూటింగ్‌లకే కాదు.. రాజకీయాల్లోనూ ఆలస్యమే. పవన్‌ అసెంబ్లీ గేటు ముట్టుకోవటమనేది ప్రజలు నిర్ణయిస్తారు’ అని పేర్ని నాని మాట‌ల‌తో కుళ్ల‌బొడిచారు.

రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని తాము వైసీపీని అడ‌గ‌లేద‌ని బీజేపీ జాతీయ నాయ‌కుడు స‌త్య‌కుమార్ అన్న విష‌యాన్ని పేర్ని నాని దృష్టికి మీడియా ప్ర‌తినిధులు తీసుకెళ్ల‌గా, ఆయ‌న ఘాటుగా స్పందించారు. ఇంత‌కూ ఎవ‌రాయ‌న అని స‌త్య‌కుమార్ గురించి ప్ర‌శ్నించారు. 25 ఏళ్లుగా తాను రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, ఆయ‌న పేరెప్పుడూ విన‌లేద‌ని స‌త్య‌కుమార్ గాలి తీశారు.

ఆట‌లో అర‌టి పండూ వినండి అంటూ వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షుడు, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స్వ‌యంగా ఫోన్ చేసి గిరిజ‌న మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా నిల‌బెడుతున్నామ‌ని, మీ అభిప్రాయం ఏంట‌ని అడిగార‌న్నారు. అలాగే ఆమె అభ్య‌ర్ధ‌త్వాన్ని బ‌ల‌ప‌ర‌చాల‌ని ప్ర‌ధాని అడిగింది వాస్త‌వ‌మ‌న్నారు. ఆట‌లో అర‌టి పండూ వినండి… ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్‌షా స్వ‌యంగా జ‌గ‌న్‌కు ఫోన్ చేసి ఫ‌లానా మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పెడుతున్నామ‌ని, మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అడిగింది య‌ధార్థ‌మ‌న్నారు.

పూర్వ‌పు బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు, ప్ర‌స్తుత ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్వ‌యంగా జ‌గ‌న్‌కు ఫోన్ చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్ మ‌హిళ‌ను రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా పెడ‌దామ‌ని అనుకున్నాం క‌దా, ఫైన‌ల్‌గా అడుగుతున్నాం మీకు స‌మ్మ‌త‌మే క‌దా అని అడిగార‌న్నారు. ఈ మాట‌ల‌న్నీ ఆట‌లో అర‌టిపండు వినాల‌ని పేర్ని నాని కోరారు. అంతేకాదు, ముర్ము అభ్య‌ర్థిత్వాన్ని బ‌ల‌ప‌రిచేందుకు రావాల‌ని జ‌గ‌న్‌కు ప్ర‌ధాని మంత్రి కార్యాల‌యం నుంచి ఫోన్ చేసింది వాస్త‌వ‌మ‌న్నారు. 

ఆట‌లో అర‌టి పండుకు ఇవన్నీ చెప్ప‌ర‌ని దెప్పి పొడిచారు. అలాగే నామినేష‌న్ ప‌త్రాల‌పై రాజ్య‌స‌భ‌, లోక్‌స‌భ‌లో వైసీపీ ప‌క్ష నేత‌లు విజ‌య‌సాయిరెడ్డి, మిథున్‌రెడ్డిల‌తో సంత‌కాలు చేయించుకున్న‌ది వాస్త‌వ‌మ‌ని పేర్ని చెప్పుకొచ్చారు.

ఆట‌లో అర‌టి పండులాంటి వారు అవాకులు చెవాకులు పేలితే మీకు శృంగ‌భంగం అవుతుంద‌ని స‌త్య‌కుమార్‌కు  హిత‌వు ప‌లికారు. అలాగే త‌మ‌ను అంట‌రాని వారిగా స‌త్య‌కుమార్ అన‌డంపై పేర్ని చుర‌క‌లు అంటించారు. తాము అంట‌రాని వార‌మైతే బీజేపీ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థి మ‌ద్ద‌తు కోసం ఎందుకొస్తున్నార‌ని నిల‌దీశారు. 

ద్రౌప‌ది ముర్మునే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ఫోన్ చేసి మ‌ద్ద‌తు తెలిపినందుకు కృత‌జ్ఞ‌త‌లు చెప్పార‌న్నారు. అలాగే ఒక‌సారి ఎమ్మెల్యేలంద‌రిని స‌మావేశ‌ప‌ర‌చాల‌ని, ఓట‌ర్లైన వారిని క‌లుస్తాన‌ని అడిగి మ‌రీ వ‌స్తున్నార‌ని, ఆమెను తాము పిల‌వ‌లేద‌ని చెప్పారు.

నిజంగా భార‌తీయ పార్టీ నిర్ణ‌యాల్లో ప్ర‌ధాన భాగ‌స్వామి అయివుంటే, స‌త్తా వుంటే త‌మ ఓట్లు అడ‌గ‌డానికి ద్రౌప‌ది ముర్మును రాకుండా ఆపాల‌ని స‌త్య‌కుమార్‌కు స‌వాల్ విసిరారు. మైకు దొరికింది క‌దా అని అమాయ‌కులైన విలేక‌రులు దొరికార‌ని అనుకుంటున్నావేమో, తెలుగు మీడియా ప్ర‌తినిధులు నీలాంటి జోక‌ర్ల‌ను ఆడుకోవ‌డంలో నెంబ‌ర్ వ‌న్ అని కితాబునిచ్చారు. 

త‌న‌తో నిన్ను ఎన్ని అనిపించారో చూడాల‌ని స‌త్య‌కుమార్‌కు హిత‌వు చెప్పారు. నోరు అదుపులో పెట్టుకోవాల‌న్నారు. చంద్ర‌బాబుకు భ‌జ‌న చేసుకో, లేదా ఆయ‌న కోస‌మే బ‌తుకు అని బీజేపీ నాయ‌కుడిని ఓ ఆట ఆడుకున్నారు. స్థాయికి మించి, శ‌క్తికి మించి మాట్లాడితే శృంగభంగం త‌ప్ప ఏమీ వుండ‌ద‌ని పేర్ని నాని తేల్చి చెప్పారు.