బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌పై బీజేపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. వ్యక్తిగత ఎజెండాను అమలు చేయాలంటే కుదరదని, ఇష్టమైన పార్టీలోకే వెళ్లి వైసీపీతో తలపడాలని సత్యకుమార్‌కు బీజేపీ పెద్దలు తలంటినట్టు సమాచారం.
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్సీపీని తమ పార్టీ జాతీయ నాయకులెవరూ కోరలేదని సత్యకుమార్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపాయి.
సత్యకుమార్ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ సీరియస్‌గా స్పందించింది. దమ్ముంటే, సత్తా వుంటే తమను బీజేపీ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఓట్లు అడగకుండా అడ్డుకోవాలని సత్యకుమార్‌కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. మద్దతు కోసం ఏపీకి మంగళవారం ఏపీకి ద్రౌపది ముర్ము వస్తున్న తరుణంలో సత్యకుమార్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.
సత్యకుమార్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి షేకావత్ సీరియస్‌గా స్పందించారు. అవి ఆయన వ్యక్తిగత అభిప్రాయాలని, పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు కోరలేదని సత్యకుమార్ అన్న మాటల్లో వాస్తవం లేదని కేంద్ర మంత్రి అన్నారు.
ద్రౌపది ముర్ముకు మద్దతు ఇవ్వాలని వైఎస్సార్సీపీ అధినేత, సీఎం జగన్మోహన్రెడ్డిని బీజేపీ అధిష్టానం కోరిందని షెకావత్ స్పష్టం చేశారు. మద్దతు విషయమై సీఎం జగన్‌తో బీజేపీ అధిష్టానం వ్యక్తిగత సంప్రదింపులు కూడా జరిపిందన్నారు. నామినేషన్ సమయంలో ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కూడా హాజరై మద్దతు తెలిపారని కేంద్ర మంత్రి షెకావత్ తేల్చి చెప్పారు.
ఇదిలా వుండగా సత్యకుమార్‌కు బీజేపీ పెద్దలు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి బదులు స్వార్థానికి వాడుకుంటున్న విషయం తమకు తెలుసని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
రాష్ట్రపతి అభ్యర్థి విషయమై జగన్‌తో తాము మాట్లాడామని, సంబంధం లేని విషయాలను ఎవరి ప్రయోజనాల కోసం మాట్లాడారని బీజేపీ పెద్దలు నిలదీసినట్టు సమాచారం. పార్టీ నియమావళిని అనుసరించి నడుచుకోవాలని, టీడీపీపై ప్రేమ వుంటే మనసులో పెట్టుకోవాలని హితవు చెప్పినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
సత్యకుమార్ పార్టీకి నష్టం తెచ్చేలా వ్యవహరిస్తున్నారని బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లినట్టు సమాచారం.