ఏపీలో కొత్త ప్రాంతీయ పార్టీ

దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి ఇదే ధ్యేయంగా కొత్త పార్టీ పెడుతున్నాని అని ఒక ఔత్సాహిక రాజకీయ నాయకుడు ప్రకటించారు. విశాఖ వేదికగా ఆయన ఈ రోజు తన కొత్త పార్టీ ప్రకటనను చేశారు.…

దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి ఇదే ధ్యేయంగా కొత్త పార్టీ పెడుతున్నాని అని ఒక ఔత్సాహిక రాజకీయ నాయకుడు ప్రకటించారు. విశాఖ వేదికగా ఆయన ఈ రోజు తన కొత్త పార్టీ ప్రకటనను చేశారు. తన పేరు చంద్రశేఖర్ పరిమిడి అని చెప్పుకున్న ఈ యువ నేత మొత్తం 26 జిల్లాలలో కూడా తమ పార్టీకి కార్యకర్తలు ఉన్నారని పేర్కొనడం విశేషం.

ఈ రోజు దేశంలో రాష్ట్రంలో పేదలకు ఏమీ సదుపాయాలు లభించడంలేదని, వారికి అభివృద్ధి ఫలాలు దక్కడంలేదని చంద్రశేఖర్ అంటున్నారు. ఇక దేశం 75 ఏళ్లలో లక్షల కోట్ల విదేశీ అప్పుని తెచ్చి ప్రపంచం ముందు దేశాన్ని చులకన చేసిందని కూడా ఆయన వాపోయారు.

దేశం బలంగా ఉండాలి. అప్పులు లేకుండా రూపాయి అయినా ఆదా చేసే స్థితిలో ఉండాలని చంద్రశేఖర్ కోరుకుంటున్నారు. అలాగే అన్ని రాష్ట్రాలకు నిధులు కేంద్రం సక్రమంగా ఇవ్వాలన్నది తన నినాదం అని అంటున్నారు. తాను పెట్టబోయే పార్టీ పేరు జెండా జెండా, గుర్తు, రంగు రూపూ అన్నీ కూడా ఆగస్ట్ 15న వెల్లడిస్తానని చంద్రశేఖర్ చెప్పారు.

తనకు దేశ రాజకీయాల మీద, రాష్ట్రం గురించి కూడా అన్నీ విషయాల మీద అవగాహన ఉందని ఆయన చెప్పారు. ఏపీలో కొత్త పార్టీని ఆగస్ట్ నాటికల్లా తెస్తామని చెబుతున్న ఈ ఔత్సాహిక రాజకీయ నాయకుడి వెనకాల ఎవరు ఉన్నారు అన్నది చూడాలి. 

జనమే తమ బలం అంటున్న ఆయన రాజకీయ ఆకాంక్ష ఎంత బలమన్నది కూడా ఆలోచించాలి.