మరి మహేష్ సెంటిమెంట్ సంగతేంటి దిల్ రాజు?

“మే నెల మాకు బాగా కలిసొచ్చింది. ఒక నిర్మాత అశ్వనీదత్ కు జగదేకవీరుడు-అతిలోకసుందరి, మహానటి లాంటి బ్లాక్ బస్టర్లు మే నెలలోనే వచ్చాయి. ఇక నా విషయానికొస్తే, మా బ్యానర్ పై వచ్చిన పరుగు,…

“మే నెల మాకు బాగా కలిసొచ్చింది. ఒక నిర్మాత అశ్వనీదత్ కు జగదేకవీరుడు-అతిలోకసుందరి, మహానటి లాంటి బ్లాక్ బస్టర్లు మే నెలలోనే వచ్చాయి. ఇక నా విషయానికొస్తే, మా బ్యానర్ పై వచ్చిన పరుగు, ఆర్య, భద్ర సినిమాలు మే నెలలోనే విడుదలయ్యాయి. అనుకోకుండా మహేష్ నటిస్తున్న మహర్షి సినిమా కూడా మే నెలలోనే విడుదలవుతోంది.”

మహర్షి సినిమా మరోసారి వాయిదా పడిందని చెప్పుకోవడానికి నిర్మాత దిల్ రాజు ఎత్తుకున్న సరికొత్త సెంటిమెంట్ ఇది. అతడి వాదనలో కాస్త నిజం ఉంది. అతడి సెంటిమెంట్ నమ్మదగ్గదే. మరి మహేష్ పరిస్థితేంటి? దిల్ రాజు, అశ్వనీదత్ కు మే నెల కలిసొస్తే సరిపోతుందా? మహేష్ కు మే నెల కలిసిరావక్కర్లేదా?

మహేష్ కెరీర్ లో మే నెల ఓ పీడకల. మే 14, 2004లో నాని వచ్చింది. అదొక డిజాస్టర్ మూవీ. ఇక మే 23, 2003లో నిజం వచ్చింది. అది కూడా అతిపెద్ద డిజాస్టర్లు. వీటికి తోడు మే 20, 2016లో వచ్చింది బ్రహ్మోత్సవం సినిమా. డిజాస్టర్ అనే పదం కూడా ఆ మూవీ రిజల్ట్ ముందు చాలా చిన్నది.

ఇలాంటి డిజాస్టర్ల తర్వాత మళ్లీ మే నెలలో థియేటర్లలోకి వచ్చే సాహసం చేయలేదు మహేష్. అలాంటిది ఇప్పుడు మహేష్ ప్రతిష్టాత్మక 25వ సినిమా మే నెలలో విడుదలకు సిద్ధమైంది. అభిమానులను కలవరపెడుతోంది.

మొదట్నుంచి మహేష్ మొత్తుకుంటుంది కూడా ఇదే. మే నెల వరకు సినిమా వస్తే అది తనకు బ్యాడ్ సెంటిమంట్ కాబట్టి ఎట్టిపరిస్థితుల్లో ఏప్రిల్ లోనే మహర్షి సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్మాతల్ని ఆదేశించాడు. అందుకే ఏప్రిల్ లోనే థియేటర్లలోకి వస్తామంటూ ఆమధ్య ప్రకటన కూడా వచ్చింది.

కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్ లో ఉండడంతో మహర్షి సినిమా మే నెలకు వాయిదా పడక తప్పలేదు. ఇక మహేష్ చేసేదేం లేదు. దేవుడ్ని ప్రార్థించడం తప్ప. కనీసం మహర్షి మూవీతోనైనా ఈ నెగెటివ్ సెంటిమెంట్ కు బ్రేక్ పడితే బాగుండు. 

ఐదేళ్లలో దగాపడ్డ ఆంధ్రప్రదేశ్‌, పదేళ్లుగా ప్రభుత్వాల మోసాలే!