హ‌మ్మ‌య్య‌…మ‌హ‌మ్మారి వీడుతోంది!

ఏపీ ప్ర‌జానీకం హ‌మ్మ‌య్య‌…అంటూ స్వేచ్ఛ‌గా, ధైర్యంగా ఊపిరి పీల్చుకునే స‌మాచారం. క‌రోనా మ‌హమ్మారి నెమ్మ‌దిగా ఆంధ్ర‌ప్రదేశ్‌ను వీడుతోంది. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్న కోవిడ్ ఆస్ప‌త్రులే. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌తోనే మ‌హ‌మ్మారి పీడ…

ఏపీ ప్ర‌జానీకం హ‌మ్మ‌య్య‌…అంటూ స్వేచ్ఛ‌గా, ధైర్యంగా ఊపిరి పీల్చుకునే స‌మాచారం. క‌రోనా మ‌హమ్మారి నెమ్మ‌దిగా ఆంధ్ర‌ప్రదేశ్‌ను వీడుతోంది. ఇందుకు నిలువెత్తు సాక్ష్యం ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్న కోవిడ్ ఆస్ప‌త్రులే. క‌రోనా ఫ‌స్ట్ వేవ్‌తోనే మ‌హ‌మ్మారి పీడ విర‌గ‌డ అయ్యింద‌నుకుంటే, సెకెండ్ వేవ్ ఉధృతి అంత‌కంటే ప్ర‌మాద‌క‌రంగా మారింది. 

పాల‌కుల నిర్ల‌క్ష్యానికి కొంత మంది ప్ర‌జ‌ల అశ్ర‌ద్ధ తోడై క‌రోనా సెకెండ్ వేవ్ విజృంభించింది. దీంతో వేలాది మంది ప్రాణాలు క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లి అయ్యాయి. క‌రోనా సెకెండ్ వేవ్ బారిన ప‌డ్డ వాళ్లు ప్ర‌ధానంగా శ్వాస స‌మ‌స్య‌తో అల్లాడిపోతున్నారు. కొంద‌రు ఎలాగోలా బ‌య‌ట‌ప‌డ‌గా, మ‌రికొందరు ప్రాణాలు విడిచారు. గ‌త రెండు నెల‌లుగా రోజురోజుకూ కేసులు పెర‌గుతూ వ‌చ్చాయి. 

రోజుకు 20 వేల‌కు పైగా కేసులు న‌మోదు అవుతూ తీవ్ర ఆందోళ‌న క‌లిగించాయి. ఒక వైపు ఆక్సిజ‌న్ బెడ్లు దొర‌క్క‌, ఆక్సిజ‌న్ కొర‌త‌తో ప్రాణాలు పోగొట్టుకున్న కుటుంబాల రోద‌న అంతాఇంతా కాదు. కుటుంబాల‌కు కుటుంబాలే క‌రోనా మ‌హ‌మ్మారికి బ‌లి అయ్యాయి. ఈ క్ర‌మంలో త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయి అనాథ‌లుగా మిగిలిన పిల్ల‌ల గోడు వ‌ర్ణ‌ణ‌కు అంద‌దు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం కోవిడ్ ఆస్ప‌త్రులు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్న వార్త ఊర‌ట‌నిచ్చేదే. శ‌నివారానికి 58 ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లో క‌రోనా బాధితులు క‌నీసం ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా లేక‌పోవ‌డం గొప్ప ఊర‌ట‌గా చెప్పుకోవ‌చ్చు. మ‌రో 80 ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య ఐదు లోపే అని, అలాగే 25 కోవిడ్ సంర‌క్ష‌ణ కేంద్రాల్లో బాధితులు అస‌లు లేర‌నే గ‌ణాంకాలు మ‌న‌సును తేలిక‌ప‌రిచేవే.

అలాగే గ‌త రెండు రోజులుగా స‌గ‌టున 10 వేల కేసులు న‌మోదు అవుతున్నాయి. శుక్ర‌వారం 1,664 ఐసీయూ, 8,186 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయి. 24 గంట‌ల్లో మ‌రిన్ని ఖాళీలు ఏర్ప‌డ్డాయి. శ‌నివారం మ‌ధ్యాహ్నానికి ఈ సంఖ్య పెరిగింది. 1,174 ఐసీయూ, 8,164 ఆక్సిజ‌న్ ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయని స‌మాచారం. ఇదే కొన‌సాగుతుంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. థ‌ర్డ్ వేవ్‌ను అరిక‌ట్ట‌గ‌లిగితే అంత‌కంటే ప్ర‌జానీకానికి ఇప్పుడు కావాల్సిందేముంది?