ఆంధ్రప్రదేశ్ లో శుక్ర, శనివారాలు విడుదల అయిన కోవిడ్ పేషెంట్ గణాంకాల ప్రకారం రోజుకు పది వేల స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. శనివారం గణాంకాల ప్రకారం ఆ రాష్ట్రంలో యాక్టివ్ పేషెంట్ల సంఖ్య 1.28 లక్షల స్థాయిలో ఉంది. అయితే, ఏపీలోని కోవిడ్ కేర్ సెంటర్లు, కోవిడ్ కు గురైన వారికి చికిత్సను అందించే ఆసుపత్రుల్లో మెజారిటీ బెడ్లు ఖాళీగా ఉన్నాయి.
ఏకంగా 58 ఆసుపత్రుల్లో ఒక్క కోవిడ్ పేషెంట్ కూడా లేకపోవడం గమనార్హం. కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిల్లో 58 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక్కరు కూడా ట్రీట్ మెంట్ చేయించుకునే వారు లేరని ఆయా ఆసుపత్రులే ధ్రువపరుస్తున్నాయి. ఇక మరో 80 ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కేవలం ఒక్కో దాంట్లో ఐదు లోపే ఉంది. అటు ఇటుగా 138 ఆసుపత్రుల్లో కలిసి 400 మంది పేషెంట్లున్నారు.
కరోనా సెకెండ్ వేవ్ లో దానికి గురైన వారు కొందరు ఆసుపత్రి పాలయిన సంగతి తెలిసిందే. కరోనా వస్తే అతిగా భయానికి గురి కాకండని వైద్యులు చెబుతూ వస్తున్నారు. కేవలం నూటికి పది మంది మాత్రమే ఇప్పుడు కూడా ఆసుపత్రికి చేరాల్సిన అవసరం రావొచ్చని వారు చెబుతున్నారు.
అయితే కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగినప్పుడు ప్రజలు చాలా భయపడ్డారు. అయితే రోజుకు 10వేల స్థాయిలో కేసులు నమోదవుతున్న దశలో కూడా ఏకంగా చాలా ఆసుపత్రుల్లో రోగులెవరూ లేరనే వార్తలు వస్తున్నాయి. అంటే.. ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య చాలా తగ్గింది. చాలా మంది హోం ఐసొలేషన్ లోనే సులువుగా కోలుకుంటున్న విషయాన్ని ఈ పరిస్థితి చాటి చెబుతోంది.
ఇక కోవిడ్ కేర్ సెంటర్లలో మాత్రం కొద్ది మంది చేరుతున్నారు. ఏపీలో 135 కోవిడ్ కేర్ సెంటర్లు ఉండగా వాటిల్లో 25 చోట్ల పేషెంట్లు ఎవరూ లేరు. మిగతా వాటిల్లో దాదాపు 12 వేల స్థాయి మంది చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ సెంటర్లలో కూడా బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది. భారీ స్థాయిలో కేసులు నమోదు అయినా.. తక్కువ స్థాయి మరణాలు సంభవించిన రాష్ట్రాల్లో ఏపీలో ముందు వరసలో ఉంటుంది. కేరళ తర్వాత కరోనా కారణ మరణాల శాతం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీనే నిలుస్తుంది.