60 శాతం త‌గ్గిన సెకెండ్ వేవ్ లోడ్

దేశంలో క‌రోనా ఉధృతి అంత వేగిరంగా కాక‌పోయినా, క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ ఉంది. గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో కూడా కొత్త కేసుల క‌న్నా కోలుకున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. ఈ నేప‌థ్యంలో యాక్టివ్…

దేశంలో క‌రోనా ఉధృతి అంత వేగిరంగా కాక‌పోయినా, క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ ఉంది. గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో కూడా కొత్త కేసుల క‌న్నా కోలుకున్న వారి సంఖ్య గ‌ణ‌నీయంగా ఉంది. ఈ నేప‌థ్యంలో యాక్టివ్ కేసుల లోడులో మ‌రో రోజు మెరుగైన త‌గ్గుద‌ల న‌మోదైంది. తాజా లెక్క‌ల ప్ర‌కారం దేశంలో యాక్టివ్ కేసుల లోడు 15ల‌క్ష‌ల్లోపు న‌మోదు అయ్యింది. 14.8 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులున్నట్టుగా ప్ర‌భుత్వ గ‌ణాంకాలు చెబుతున్నాయి. 

సెకెండ్ వేవ్ లో క‌రోనా పీక్ స్టేజికి చేరిన‌ప్ప‌టితో పోలిస్తే.. ఇప్పుడు న‌మోదైన కేసుల సంఖ్య 40 శాతంతో స‌మానం. పీక్ స్టేజ్ నుంచి త‌గ్గుద‌ల‌లో ఇప్పుడు 60శాతం కేసుల లోడ్ త‌గ్గిపోయింది. దేశంలో ఒక ద‌శ‌లో 37 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇప్పుడు ఆ నంబ‌ర్ 15 ల‌క్ష‌ల్లోపు న‌మోద‌వుతూ ఉంది. అయితే రోజువారీ కేసులు గ‌త వారంలో దాదాపు స్థిరంగా కొన‌సాగడం గ‌మ‌నార్హం. రోజుకు ల‌క్ష‌కు పైగా కేసులే ఇంకా న‌మోద‌వుతూ ఉన్నాయి. 

ఇప్పుడు కూడా కొన్ని రాష్ట్రాలే ఎక్కువ కేసులను న‌మోదు చేస్తూ ఉన్నాయి. ఇక టెస్టుల సంఖ్య‌తో పోలిస్తే పాజిటివిటీ రేటు బాగా త‌గ్గ‌డం ఊర‌ట‌. ప్ర‌స్తుతం ఆరు శాతం లోపు న‌మోద‌వుతూ ఉంది పాజిటివిటీ రేటు. కానీ అన్నింటి క‌న్నా విచార‌క‌ర‌మైన అంశం మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గానే న‌మోద‌వుతూ ఉండ‌టం.

గ‌త వారంలో రోజువారీ కేసుల సంఖ్య ల‌క్ష‌న్న‌ర లోపే న‌మోదైనా.. గ‌త ఇర‌వై నాలుగు గంట‌ల్లో కూడా క‌రోనా కార‌ణ మ‌ర‌ణాల సంఖ్య రెండు వేల‌ను దాటింది. ఒక్క రోజులో ఈ సంఖ్య‌ 2,241 గా ఉంది. దాదాపు నెల నుంచి కేసుల సంఖ్య త‌గ్గుతూ వ‌స్తోంది. అయినా ఇంకా రోజుకు ల‌క్ష‌కు పైగా కేసులు న‌మోదు అవుతున్నాయి. జూన్ నెల‌లో సెకెండ్  వేవ్ పూర్తిగా క్షీణిస్తుంద‌ని ఇది వ‌ర‌కే ప‌రిశోధ‌కులు చెప్పిన సంగ‌తి తెలిసిందే.