కరోనాను ఎదుర్కొనడానికి వ్యాక్సినేషనే శరణ్యం అని వైద్య నిపుణులు స్పష్టం చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలు వ్యాక్సిన్ కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు. ఫస్ట్ డోస్ వేయించుకున్న వారికి సెకెండ్ కు గతి అంత తేలికగా లేదు.
ఇక ఫస్ట్ డోస్ వేయించుకున్న వారిలో కూడా అనేక మందికి కరోనా వచ్చి, పోయింది. వారు సెకెండ్ డోస్ విషయంలో గందరగోళమైన స్థితిలో ఉన్నారు. భారత ప్రభుత్వాలేమో.. గడువులు పెంచుకుంటూ పోతున్నాయి. రెండు డోసుల మధ్యన గడువును పెంచడం, కేవలం వ్యాక్సిన్ డిమాండ్ కు రీచ్ కాలేకపోవడమే కారణమనే అభిప్రాయాలు ప్రజల్లో ఏర్పడ్డాయి.
ఇక ఇంతకీ వ్యాక్సినేషన్ ఇప్పుడు ఎలా సాగుతోంది? అంటే.. శనివారం (నిన్న) దేశ వ్యాప్తంగా 31 లక్షల డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మొన్నటి వరకూ ఈ పరిమాణం 20 లక్షల డోసులుగా ఉండేది. క్రమంగా పెరుగుతూ ఇప్పుడు 31 లక్షల డోసులకు చేరింది. ఇది ఎంతో కొంత సానుకూలాంశమే.
అయితే.. డిమాండ్ మాత్రం పతాక స్థాయిలో ఉంది. అటూ ఇటుగా రోజుకు 80 లక్షల నుంచి కోటి డోసుల వ్యాక్సిన్ డోసులు ప్రతి రోజూ వేయాలి. అప్పుడే మరో వేవ్ లోపు ఇండియాలో అందరికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందవచ్చు. కానీ ఈ టార్గెట్ ఇప్పుడప్పుడే రీచ్ అయ్యే అవకాశాలు లేవు. అందుకు ఇంకా నెలన్నరకు పైగా సమయం పడుతుందని కేంద్ర ప్రభుత్వమే తేల్చి చెబుతోంది. ఆగస్టు నాటికి రోజుకు కోటి డోసుల వ్యాక్సినేషన్ అని కేంద్రం ఇది వరకే ప్రకటించింది.
డిసెంబర్ నాటికి 200 కోట్ల డోసులు అవసరం అనే లెక్కలోకి తీసుకుంటే.. ఐదు నెలల్లో 150 కోట్ల డోసులు వేయడానికి ఆస్కారం ఉంది. ఆ లోపు రానున్న రెండు నెలల్లో 50 కోట్ల డోసేజుల వ్యాక్సినేషన్ జరిగితే.. ఈ సంవత్సరాతానికి టార్గెట్ ను రీచ్ అయ్యే అవకాశం ఉంది. అయితే.. రోజుకు కోటి డోసుల వ్యాక్సిన్ టార్గెట్ ను ఇండియా నిజంగానే ఆగస్టు ఒకటికి రీచ్ కాగలదా? అనేది పెద్ద ప్రశ్న.
కొత్త వ్యాక్సిన్లు అయితే అందుబాటులోకి రానున్నాయనే ఆశలు మొలకెత్తుతున్నాయి. హైదరాబాద్ బేస్డ్ కంపెనీలనే మరోటి ఆగస్టు నుంచి నెలకు ఐదారు కోట్ల నుంచి ఎనిమిది కోట్ల డోసులను అందిస్తానని అంటోంది. మూడో దశ ట్రయల్స్ లో ఆ వ్యాక్సిన్ ఉందని తెలుస్తోంది. ఇక స్ఫూత్నిక్ టెక్నాలజీని ఇతర దేశాలతో తాము పంచుకుంటామని పుతిన్ ప్రకటించారు. ఇప్పటి వరకూ ఏ దేశం ఇలాంటి ప్రకటనలు చేయలేదు. రష్యా నుంచి అధికారికంగా ఈ ప్రకటన రావడం మిగతా ప్రపంచానికి ఊరటను ఇచ్చే అంశం.
తమ వ్యాక్సిన్ 90 శాతానికిపైగా ప్రభావితం అని రష్యా అంటోంది. ఒక దశలో రష్యా వ్యాక్సినే ఫేక్ అంటూ కొందరు మాట్లాడారు. అయితే.. ఇప్పుడు రష్యానే తన సాంకేతిక వివరాలను పంచుకుంటానని అంటోంది. ఇండియాలో రష్యాన్ వ్యాక్సిన్ విస్తృతంగా రాబోతోంది కూడా. స్థూలంగా రానున్న రోజుల్లో కరోనా వ్యాక్సిన్ కష్టాలు తీరతాయి. కానీ ఇప్పుడప్పుడే కాదు. అందుకు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ లోపు కరోనా మరోసారి రెచ్చిపోక పోతే మాత్రం గండం నుంచి గట్టెక్కినట్టే.