కరోనా వైరస్‌కు చిన్నాపెద్దా, పేదధనిక అనే తేడాల్లేవని అనేక సార్లు చెప్పుకున్నాం. తాజాగా స్పెయిన్ యువరాణి మరియా థెరిసాను బలి తీసుకోవడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. కాకపోతే ఆమె వయసు 86 సంవత్సరాలు కావడం గమనార్హం. తన సోదరి కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్టు ప్రిన్స్ ఎన్రిక్ డి బోర్బన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఈ సమాచారం లోకానికి తెలిసివచ్చింది.
అతను ఇచ్చిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. యువరాణికి కరోనా వైరస్ సోకినట్టు తెలియగానే కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. వెంటనే వైద్యం అందించడం ప్రారంభించారు. అయినా ఫలితం లేకపోయింది. చివరికి ఆమె ప్రాణాలను బలి తీసుకోవడం ద్వారా కరోనానే విజయం సాధించింది.
ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా ఒక రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కరోనాతో మృతి చెందిన కేసుగా రికార్డుకెక్కింది. కరోనాతో యూరోపియన్ దేశాలు అతలాకుతలమవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇటలీ తర్వాత స్పెయిన్‌లో అత్యధికంగా కరోనా మృతి కేసులు నమోదు అవుతున్నాయి. మాడ్రిడ్‌లో స్పెయిన్ యువరాణి మరియా థెరిసాకు అంత్యక్రియలు జరిగాయి.