తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. మూడు రోజుల నుంచి భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
మరో రెండురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చిరించింది. దీంతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు రేపటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. గత రెండురోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా సగటున 8 సెం.మీ వర్షపాతం నమోదైంది.
తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన సహాయక చర్యలపై ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని సీఎం కేసీఆర్ నిర్వహించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో వర్షాల తీవ్రత, రానున్న రోజుల్లో మరింత విస్తారంగా వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సోమవారం నుంచి బుధవారం వరకూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. సమావేశం అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ మరో రెండురోజులు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం వుందన్నారు.
కావున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని మంత్రి సూచించారు.