రాజకీయాలు దుర్మార్గమైనవి. శత్రువుల్ని మిత్రులుగా, మిత్రుల్ని శత్రువులుగా మార్చే రంగం ఏదైనా వుందంటే… అది రాజకీయమే. నాలుగేళ్ల క్రితం వరకూ వైఎస్ వివేకాను విమర్శించినోళ్లు, నేడు పొగుడుతున్నారు. నాడు ప్రశంసించిన వాళ్లే, ఇప్పుడు ఆయన వ్యక్తిగత జీవితంలోని బలహీనతలను బయటపెడుతున్నారు. స్వప్రయోజనాల కోసం ఇతరుల్ని బలి పెట్టడం మానవ సహజ లక్షణమైంది.
నేడు వివేకా జయంతి. ఆయనకు నివాళులర్పించడం వైఎస్ కుటుంబ సభ్యులు మరిచిపోయారు. కానీ నారా లోకేశ్ మాత్రం వివేకా జయంతిని గుర్తు పెట్టుకుని మరీ నివాళి అర్పించారు. అంతేకాదు, దీన్ని అవకాశంగా తీసుకుని సీఎం జగన్‌పై తనదైన స్టైల్‌లో సెటైర్స్ విసరడం గమనార్హం. ఇదే సందర్భంలో లోకేశ్‌కు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు చీవాట్లు పెట్టడం గమనార్హం.
ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసి, మానసికంగా కుంగి, చివరికి ప్రాణాలు పోవడానికి మీ తండ్రి చంద్రబాబు, ఆయనకు సహకరించిన యనమల రామకృష్ణుడు తదితరులు కారణమని తెలుసా లోకేశ్ అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎన్టీఆర్ చావుకు కారణమై, మళ్లీ ఆయనకు నివాళులర్పించే కళ తమ నాయకుడు వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులకు అబ్బలేదని లోకేశ్‌కు వైసీపీ నేతలు కౌంటర్ ఇవ్వడం విశేషం.
వివేకాకు నివాళితో పాటు విమర్శలు గుప్పించిన లోకేశ్ ట్వీట్ ఏంటో తెలుసుకుందాం.
‘ఈ రోజు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారి జయంతి, అబ్బాయిలు మరిచిపోయినట్టున్నారు. వీరికి బాబాయ్ జయంతి గుర్తుండదు కానీ వర్థంతి మాత్రం డేట్, టైముతో సహా గుర్తుంటుందని సీబీఐ నిర్ధారించింది. వేటు వేసిన చేతులతోనే బాబాయ్ జయంతికి ట్వీటు వేస్తే బాగోదనేమో వేయలేదు. అబ్బాయిల వేధింపులు-కుతంత్రాలకి ఎదురొడ్డి సోదరి సునీత గారు చేస్తున్న న్యాయ పోరాటంలో తప్పక గెలుస్తారు. తన తండ్రిని చంపిన కన్నింగ్ కజిన్స్‌తో జైలు ఊచలు లెక్కపెట్టించే వరకూ విశ్రమించరు. వివేకానందరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను’ అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
లోకేశ్ ట్వీట్ ఎఫెక్ట్‌తో ఎన్టీఆర్ వెన్నుపోటు ఎపిసోడ్‌ను వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. ఎన్టీఆర్‌ను చంపిన చేతులే ఆయనకు నివాళులర్పించడం ద్వారా, ఆ మహనీయుడి ఆత్మ ఘోషిస్తోంటోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. చివరికి వర్ధంతులు, జయంతులను కూడా రాజకీయ స్వార్థానికి విడిచి పెట్టడం లేదనే సంగతి తెలిసొస్తోంది. కాదేదీ రాజకీయ విమర్శకు అతీతం కాదని సరిపెట్టుకోవాల్సిందేమో!