వైఎస్ వివేకా హత్యానంతరం ఆయన కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత అందరికీ పరిచయం అయ్యారు. ఎప్పుడూ ఆమె జనం ముందుకు వచ్చిన వారు కాదు. ఇప్పుడు కూడా తండ్రి హత్య కేసు విషయంలో పోరాడుతుండడంతో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇవాళ తన తండ్రి వివేకా చెప్పిన విషయాలను ఆమె నెమరువేసుకున్నారు. ఇవాళ వైఎస్ వివేకానందరెడ్డి జయంతి.
డాక్టర్ సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కుటుంబ సభ్యులు పులివెందులకు వెళ్లారు. వివేకా సమాధి వద్ద ఆయనకు నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ సునీత మీడియాతో మాట్లాడుతూ తండ్రితో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. అలాగే సీబీఐ విచారణ గురించి మాట్లాడారు.
వివేకా హత్యపై సీబీఐ దర్యాప్తులో ఎవరూ జోక్యం చేసుకోవద్దని సూచించారు. సీబీఐ తన పని తాను చేసుకుపోతోందన్నారు. ఆ విషయాలపై తాను మాట్లాడనని అన్నారు. చిన్నప్పుడు తనతో తండ్రి చెప్పిన విషయాలను మీడియాకు వివరించారు. పొగడ్తలను పెద్దగా పట్టించుకోవద్దని చెప్పారన్నారు. అలాగే ఎవరైనా తప్పులు చూపితే వాటి గురించి సీరియస్‌గా పట్టించుకోవాలని సూచించారన్నారు.
వివేకా హత్యపై సుప్రీంకోర్టు విధించిన మేరకు సీబీఐ దర్యాప్తు గడువు ముగిసిన సంగతి తెలిసిందే. డాక్టర్ సునీత చివరి వరకూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయించాలని ప్రయత్నించారు. అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం బెయిల్ ఇవ్వడంతో సునీత కోరిక నెరవేరలేదు. అవినాష్‌రెడ్డి బయట ఉండడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.