రీమేక్ తీసే జనాలకు పెద్ద టాస్క్ ఇది. ఉన్నది ఉన్నట్టు తీద్దామా.. నేటివిటీ, స్టార్ డమ్ కు తగ్గట్టు మార్పులు చేద్దామా అనే సంశయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. యాజ్ ఇటీజ్ తీసిన తర్వాత ఫ్లాప్ అయితే ఓ బాధ. మార్పుచేర్పులు చేసిన తర్వాత ఫ్లాప్ అయితే యథాతథంగా తీయాల్సిందేమో అనే ఆలోచన నిద్రపట్టనీయదు.
అయితే ఇలాంటి మీమాంస తనకు లేదని స్పష్టం చేశాడు మెహర్ రమేష్. చిరంజీవితో వేదాళం సినిమా తీయాలని డిసైడ్ అయిన మరుక్షణమే, ఆ కథలో ఏం ఉండకూడదో తను రాసుకున్నానని, అదే విషయాన్ని చిరంజీవికి కూడా చెప్పానని అన్నాడు. అలా మూలకథకు చాలా మార్పులు చేసినట్టు వెల్లడించాడు.
“వేదాళం కథ హక్కుల్ని తీసుకొని దానికి మార్పుచేర్పులు చేశాం. చిరంజీవికి ఈ స్టోరీ ఏ విధంగా ఉంటే బాగుంటుందనే కోణంలో ఆలోచించి కసరత్తులు చేశాం. చిరంజీవి సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ ఉండాలి, యాక్షన్ ఎపిసోడ్స్ బాగుండాలి, మంచి సాంగ్స్ సిచ్యుయేషన్స్ కుదరాలి.. ఇవే కదా ఆలోచిస్తాం. అలానే ఆలోచించి మార్పులు చేశాం. ఓవరాల్ గా ఒరిజినల్ కథకు 60-70 శాతం మార్పులు చేశాం. స్క్రీన్ ప్లే, సన్నివేశాల నుంచి డైలాగ్స్ వరకు చాలా మార్పులు జరిగాయి.”
ఇలా వేదాళం సినిమాను దాదాపు 70శాతం మార్చేసి భోళాశంకర్ చేసినట్టు స్పష్టం చేశాడు మెహర్. ఇక టీజర్ లో చిరంజీవి తెలంగాణ యాస పై వచ్చిన విమర్శలపై కూడా మెహర్ స్పందించాడు. తెలంగాణ స్లాంగ్ చిరంజీవికి కొత్త కాదంటున్నాడు.
“స్టేట్ రౌడీలోనే చిరంజీవి తెలంగాణ యాస మాట్లాడారు. ఆయన్ను నైజాం కింగ్ అంటారు. శంకర్ దాదా ఎంబీబీఎస్ లో కూడా మాట్లాడారు. ఆయనకు తెలంగాణ యాస కొత్త కాదు. చిరంజీవి తెలంగాణ యాస మాట్లాడ్డం అనేది సినిమాలో ఓ భాగం మాత్రమే. కథలో హైదరాబాద్ పార్ట్ వరకు మాత్రమే అలా ఉంటుంది. కలకత్తాలో అలా ఉండదు.”
భోళాశంకర్ కథపై వర్క్ చేయడానికి మెహర్ కోసం, ఇప్పుడున్న స్టార్ డైరక్టర్స్ చాలామంది ముందుకొచ్చారంట. అయితే చిరంజీవి మాత్రం కేవలం మెహర్ రమేష్ ను మాత్రమే వర్క్ చేయమని చెప్పారంట. అలా ఇతర దర్శకుల ఇన్ పుట్స్ తీసుకోకుండానే భోళాశంకర్ పూర్తిచేసినట్టు తెలిపాడు మెహర్.