పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయొద్దంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ పై మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన స్టయిల్ లో స్పందించారు. సినీ పరిశ్రమపై కామెంట్స్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్న బొత్స.. టాలీవుడ్ ను పిచ్చుక అని చిరంజీవి అనుకుంటున్నారా అంటూ కొత్త కోణం వెలికితీశారు.
“సినీ పరిశ్రమ మీద ఎందుకు కామెంట్ చేస్తాం. అసలు ఎవరు పిచ్చుక.. ఎవరు బ్రహ్మాస్త్రం. సినీ పరిశ్రమ పిచ్చుక అని చిరంజీవి ఉద్దేశమా? నాకు తెలీదు. టాలీవుడ్ ఓ పిచ్చుక అని ఆయన ఒప్పుకుంటున్నాడా? దానిపైన బ్రహ్మాస్త్రం వేయొద్దు అంటున్నారా? నాకైతే తెలియదు. ఆయన ఏ ఉద్దేశంతో మాట్లాడారో, ఆలోచన ఏంటో, బ్యాక్ గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు. ఓసారి ఆ వివరాలన్నీ చూసిన తర్వాత రెస్పాండ్ అవుతా. ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది కానీ సినిమాల కోసం పనిచేయదు కదా. సినిమాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గరకు ఏమైనా వస్తే అప్పుడు మాట్లాడతాం.”
కొన్ని రోజులుగా బ్రో సినిమాపై కొనసాగుతున్న రాజకీయ వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఆ సినిమాపై, పవన్ కల్యాణ్ పై అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ఇవ్వాల్సిన ప్యాకేజీ డబ్బులే, బ్రో సినిమా రెమ్యూనరేషన్ కింద, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చేతుల మీదుగా పవన్ కల్యాణ్ కు అందిందంటూ ఆరోపణలు చేశారు.
ఈ మొత్తం వ్యవహారంపై చిరంజీవి పరోక్షంగా స్పందించారు. పథకాలు, ప్రాజెక్టులు, ప్రత్యేక హోదా లాంటి అంశాలపై దృష్టి పెడితే, శిరస్సు వంచి నమస్కరిస్తామని.. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తమ మీద ఎందుకు ఏడుస్తున్నారంటూ కామెంట్స్ చేశారు.
చిరంజీవి కామెంట్స్ వచ్చిన వెంటనే కొడాలి నాని, పేర్ని నాని లాంటి నేతలు ఘాటుగా స్పందించారు. ఇప్పుడీ లిస్ట్ లోకి బొత్స సత్యనారాయణ కూడా చేరారు. తనదైన స్టయిల్ లో రియాక్ట్ అయ్యారు. ఈ అంశాన్ని పూర్తిగా స్టడీ చేసి మళ్లీ ఇంకోసారి రియాక్ట్ అవుతానంటూ ఆయన ప్రకటించడం విశేషం.