జనసేనాని పవన్‌కల్యాణ్ మనసులోని ఆవేదనంతా బయట పెట్టుకున్నారు. తనను రెండు చోట్ల ఎమ్మెల్యేగా గెలవకుండా కక్ష కట్టి ఓడించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనవాణి- జనసేన భరోసా కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తన మార్క్ ప్రసంగం చేశారు.
జనవాణి వంటి కార్యక్రమాలు చేపట్టడం సాహసంతో కూడుకున్నవన్నారు. జనవాణి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టాల్సిన పని అని అన్నారు. సంపూర్ణంగా దహించుకుపోవడానికి తాను వచ్చినట్టు చెప్పుకొచ్చారు. అది గెలిపిస్తుందా లేదా అనేది తనకు తెలియదన్నారు. వైసీపీ తాలూకూ దాష్టీకాన్ని తట్టుకోడానికి జనసేనకు చాలా గుండె బలం వుందన్నారు. జనసేనను అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమని నిన్న ప్లీనరీలో అనడం చూశానన్నారు. మీరేమైనా దిగొచ్చారా? అని ప్రశ్నించారు.
వైసీపీ దౌర్జన్యాల్ని ఆపాలి, ఎదుర్కోవాలి అంటే ప్రతి ఒక్కరూ కొంచెం తెగించాలని పిలుపునిచ్చారు. పవన్‌కల్యాణ్ ఒక్కడే తెగిస్తే సరిపోదన్నారు. ప్రతి గ్రామంలో ఆడ, మగ అనే తేడా లేకుండా కామన్ మినిమమ్ ప్రోగ్రాం కింద ఉమ్మడిగా పోరాటం చేయకపోతే మాత్రం రాష్ట్రం నష్టపోతుందని పవన్ హెచ్చరించారు. అందరూ కలిసి పోటీ చేస్తారో లేదో తనకు తెలియదన్నారు.
దౌర్జన్యాలు చేస్తుంటే అన్ని చోట్లకి తాను ఒకేసారి రాలేనని చెప్పారు. ఎందుకంటే తాను అన్నిచోట్ల ఒకేసారి ఉండలేనన్నారు. తాను మామూలు సగటు మనిషినన్నారు. ప్రతి చోట, ప్రతి గ్రామంలో ప్రశ్నించే తత్వం, ఎదురు తిరిగే తత్వం, పోరాడేతత్వం, కొంత పోగొట్టుకోడానికి సిద్ధంగా లేకపోతే మార్పు రాదన్నారు.
తనకూ పిల్లలున్నారని గుర్తు చేశారు. తనకూ వృత్తి వుందన్నారు. తన సినిమాల్ని ఆపేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. తన ఆర్థిక వనరుల్ని దెబ్బకొడ్తారన్నారు. అయినా సిద్ధపడి ఎందుకొచ్చానంటే …తన ఒక్కడి స్వార్థం కోసం కాదన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల కోసం మనస్ఫూర్తిగా రిస్క్ చేసి వచ్చినట్టు పవన్ తెలిపారు. తనకు అధికారం లేదని, కక్ష కట్టి తనను రెండు చోట్ల ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు సంపూర్ణంగా దహించుకుపోవడానికి తాను వచ్చినట్టు చెబుతూనే, మరోవైపు తనకు పిల్లలున్నారని, సినిమాలున్నాయని, ఆదాయాన్ని దెబ్బతీస్తారని వాపోవడం పవన్‌కల్యాణ్‌లోని అయోమయ్యాన్ని తెలియజేస్తోంది. ఒకవైపు రిస్క్ చేసి రాజకీయాల్లోకి వచ్చానంటూనే, నష్టపోతాననే ఆందోళన వ్యక్తం చేయడం ఆయనకే చెల్లింది.
అధికారం ఎవరికైనా ఊరికే దక్కుతుందా? జగన్, చంద్రబాబు ఇలా ఎవరిని తీసుకున్నా ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా ఎన్నెన్ని ఎదురు దెబ్బలు తిన్నారో పవన్‌కు తెలియదా? అయినా తాను ఏం నష్టపోయానని ఆయన ఆవేదన చెందుతున్నారో మరి!