ఆంధ్రప్రదేశ్‌లో బలపడేందుకు బీజేపీ మరో ప్రయత్నం చేస్తోంది. ఏపీలో పాదయాత్ర చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాదయాత్రపై ఏపీ బీజేపీ నేతలు చర్చించారు.
పాదయాత్రను సెప్టెంబర్ 25న పండిట్ దీనదయాళ్ జయంతి రోజు చేపట్టాలని సూత్రప్రాయంగా బీజేపీ నేతలు నిర్ణయించారని సమాచారం. అయితే మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ బస్సు యాత్ర కంటే ముందుగా బీజేపీ పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించడం విశేషం.
విజయదశమి సందర్భంగా అక్టోబర్ 5న పవన్‌కల్యాణ్ తిరుపతి నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నట్టు నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ చెప్పిన సంగతి తెలిసిందే. జగన్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను జనంలోకి తీసుకెళ్లాలనే తలంపుతో పవన్ జనంలోకి వెళుతున్నట్టు జనసేన ప్రకటించింది.
ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కూడా ఆరు నెలల పాటు పవన్‌కల్యాణ్ బస్సుయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు.
మరోవైపు జనసేన మిత్రపక్షం బీజేపీ కూడా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి ఒకేసారి పాదయాత్ర చేస్తారా? లేక ఒక చోట నుంచే మొదలు పెడతారా? అనేది ఇంకా స్పష్టత రాలేదని సమాచారం.
ఏపీలో రైతులతో పాటు ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలపై పాదయాత్రలో దృష్టి పెట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే ప్రకటించారు. పొత్తులో ఉన్న బీజేపీ, జనసేన ఎవరికి వారుగా పది రోజుల తేడాతో ఏపీ వ్యాప్తంగా యాత్రలు చేపట్టాలని నిర్ణయించడం చర్చకు దారి తీసింది.