పంచాయతీలను వట్టిపోయిన తీరుగా చేసి వదిలేసిన పచ్చ పార్టీ పెద్దలు అధికారం నుంచి దిగిపోయినా కూడా ఇంకా సాధిస్తూనే ఉన్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే జనవరి నెలాఖరులోనే లోకల్ బాడీ ఎన్నికలు పూర్తి అయ్యేవి.
కోర్టు కేసుల ద్వారా మెలిక పెట్టి మార్చి వరకూ కధను లాక్కొచ్చారు. పోనీ అపుడైనా ఎన్నికలు సత్వరమే జరుగుతాయనుకుంటే హఠాత్తుగా వాయిదా వేయించారు. జగన్ సర్కార్ బాధపడినదల్లా 14వ ఆర్ధిక సంఘం నిధులు మురిగిపోతాయని, దాదాపుగా అయిదు వేల కోట్ల రూపాయలు ఏపీకి రాకుండా పోతాయని.
మొత్తానికి జగన్ ఆవేదనను అర్ధం చేసుకున్న కేంద్రం 14వ ఆర్ధిక సంఘం పేరిట తొలి విడతగా లోకల్ బాడీలకు నిధులను విడుదల చేసింది. సరైన సమయంలో ఆ నిధులు ఇపుడు పంచాయతీల చేతిలో పడ్డాయి. రెండేళ్ళుగా రూపాయి కూడా లేక అల్లాడుతున్న పల్లెలకు ఇపుడు కొంత వెసులుబాటు కలిగింది.
ఉత్తరాంధ్రా జిల్లాలలోని గ్రామ పంచాయతీల ఖాతాల్లో మొదటి విడత నిధులు జమ అయ్యాయి. ఈ లెక్కన విజయనగరం జిల్లాకు 46 కోట్ల రూపాయల నిధులు వచ్చాయి. వీటిని పారిశుద్ధ్యం, ప్రాధమిక అవసరాల కోసం వెచ్చించేందుకు పంచాయతీ అధికారులు సిధ్ధపడుతున్నారు.
సరిగ్గా కరోనా వైరస్ పొంచి ఉన్న వేళ పంచాయతీలకు ఈ నిధులు రావడం అతి పెద్ద ఊరటగా అటు అధికారులు, ఇటు పంచాయతీలకు చెందిన వైసీపీ నేతలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి లోకల్ బాడీ ఎన్నికలు ఈ పాటికే అయి ఉంటే పూర్తి నిధులే వచ్చేవని అంటున్నారు. ఏది ఏమైనా పైసలతో పంచాయతీల్లో ఇపుడు కొత్త కళ కనిపిస్తోంది.