ప్రదీప్ మాచిరాజు…రెండు తెలుగు రాష్ట్రాల్లో అగ్రశ్రేణి మేల్ యాంకర్. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడి విమర్శలు పాలైనా…యాంకరింగ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. బుల్లితెరతో పాటు ఇటీవల వెండి తెరపై కూడా తళుక్కుమని మెరుస్తున్నాడు. ఇంత వరకూ యాంకర్‌గా, నటుడిగా మాత్రమే తెలిసిన ప్రదీప్…కరోనా విధ్వంసం ఆయనలో మరో కోణాన్ని కూడా చూపుతోంది.
లాక్డౌన్ వల్ల సినిమా, టీవీ షూటింగ్‌లన్నీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిసీ కార్మికులను ఆదుకునేందుకు కొంతమంది హీరోలు, దర్శకనిర్మాతలు ముందుకొచ్చి రూ.కోట్లల్లో విరాళాలు ప్రకటిస్తున్నారు. అయితే బుల్లితెరపై కూడా చాలా మంది కార్మికులు ఆధారపడి ఉంటారు. వారిని ఆదుకునేందుకు ఇంత వరకూ ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
ఈ పరిస్థితుల్లో తానున్నానంటూ యాంకర్ ప్రదీప్ ముందుకు రావడం ప్రశంసనీయం. బుల్లితెరకు సంబంధించి ఒక్కో షోకు వందలాది కార్మికులు కష్టపడుతుంటారు. వీరిలో కొందరినైనా తన శక్తి మేరకు ఆదుకునేందుకు ప్రదీప్ ముందుకొచ్చాడు. తనకు తెలిసిన 60 మంది బుల్లితెర కార్మికులకు ఒక నెలకు సరిపడా ఆర్థికసాయం చేస్తాననని ఆయన ప్రకటించాడు. ఈ మేరకు ఒక వీడియోను విడుదల చేశాడు. ఆ వీడియోలో ప్రదీప్ చెప్పిన వాటిలో ముఖ్యమైన అంశాలేంటంటే…
‘ కరోనా వైరస్‌ను తరిమి కొట్టే క్రమంలో లాక్డౌన్ చేపట్టడంతో చాలా రోజుల నుంచి షూటింగ్‌లు జరగట్లేదు. ఇంకా ఎన్ని రోజులు జరగకుండా ఉంటాయో తెలీదు. ఈ పరిస్థితిలో వాళ్లకు ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటుంది. రోజువారీ వేతనానికి పనిచేసే బుల్లితెర కార్మికులకు సంబంధించి నాకు తెలిసిన 50 నుంచి 60 కుటుంబాలు ఉన్నాయి. వాళ్లందరికీ ఒక నెలకు సరిపడే ఆర్థిక సహాయాన్ని నేను చేద్దామని అనుకుంటున్నాను. నా తరఫున ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఎందుకంటే ఇది నా టెలివిజన్ ఫ్యామిలీ. నేను షోలు చేయడానికి వీళ్లంతా ఎంతగానో సహాయం చేశారు. అందుకే, వాళ్లు కనీస అవసరాలు పొందడానికి నేను సాయం చేస్తాను’ అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు.
యాంకర్ ప్రదీప్‌ను ఆదర్శంగా తీసుకుని బుల్లితెర సెలబ్రిటీలు ముందుకొస్తే, ఆ రంగంలోని కార్మికుల కనీస అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. తమ ఉన్నతి కోసం ఇంత కాలం శ్రమిస్తూ వచ్చిన బుల్లితెర కార్మికులను ఆదుకోవడం టెలివిజన్ సెలబ్రిటీల కనీస మానవత్వం. మానవీయ కోణంలో వాళ్లంతా ఆలోచిస్తారని ఆశిద్దాం.