కరోనా భయాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వైద్యసేవలు స్తంభించాయి. అత్యవసరమైన ఆపరేషన్లు కూడా వాయిదా పడ్డాయి. కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఇన్-పేషెంట్ల నంబర్ సగానికి సగం తగ్గిపోయింది. రోజువారీ ఓపీలు కూడా 80 శాతం తగ్గిపోయాయి. అత్యవసరమైతే తప్ప రోగులు కూడా ఆస్పత్రులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. అంటే ఇప్పటివరకూ కార్పొరేట్ ఆస్పత్రులతో సహా.. ఓ మోస్తరు ప్రైవేట్ ఆస్పత్రులు కూడా ప్రజల్ని ఎంత దారుణంగా దోచుకున్నాయో ఈ సిచ్యుయేషన్ ని బట్టి అర్థం చేసుకోవచ్చు.
జ్వరంతో బాధపడుతూ మామూలూ ఆస్పత్రికి వెళ్లినా హడావిడిగా అడ్మిట్ చేసుకోవడం, వెంటనే ప్లేట్ లెట్ కౌంట్స్ నిర్థారించడానికి రక్త పరీక్షలు చేయడం, అవసరం ఉన్నా లేకపోయినా స్కానింగ్ తీసేయడం.. ఇలాంటివి అత్యంత సహజం అయిపోయాయి. మధ్యతరగతి ప్రజలు కూడా వీటికి అలవాటు పడిపోయారు. నాడి పట్టుకుని వైద్యం చేసే డాక్టర్లు కరువయ్యారు, పరీక్షలతో హడావిడి చేసేవారే ఎక్కువయ్యారు.
ఒకవేళ ఎలాంటి పరీక్ష లేకుండా డాక్టర్ మందులు రాసినా, అనుమానంగా చూసే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు కరోనా దెబ్బతో పేషెంట్లను చూడటానికి డాక్టర్లు భయపడుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రులకు పేషెంట్లను రిఫర్ చేసే మామూలు డాక్టర్లు దుకాణం సర్దేసే సరికి అటు కార్పొరేట్ ఆస్పత్రులకు కూడా కళ తప్పింది. మరోవైపు అవసరం ఉన్నా లేకపోయినా ఇన్ పేషెంట్లుగా ఎవరినీ చేర్చుకోవడం లేదు. ఎందుకొచ్చిన తిప్పలు అనుకుని సైలెంట్ అయ్యారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో పనిచేసే చాలామంది స్పెషలిస్ట్ వైద్యులు కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు. అంటే ఇప్పటి వరకూ అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల్ని భయపెట్టి కార్పొరేట్ ఆస్పత్రులు ఎలా దోచుకున్నాయో, ఆరోగ్యశ్రీ, హెల్త్ కార్డులుంటే చాలు, వారిని ఎలా ఐసీయూలకి తరలించారో అర్థమవుతోంది.
ఆస్పత్రుల్లో మోసం జరక్కపోతే.. గతంలోలాగే ఇప్పుడు కూడా రోగులు వైద్య సేవల కోసం హడావిడి పడాల్సి వచ్చేది కదా, ఆ పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు. ఒక రకంగా కరోనా ప్రజల ఆలోచనా ధోరణిని కూడా కొంతవరకు మార్చగలిగింది. సాధారణ జ్వరం, జలుబుకి కూడా హడావిడి పడకుండా ఇంటి వద్దే మందులు వేసుకుంటూ.. వేచి చూసే ధోరణికి ప్రజలు వచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రులకు ఇప్పుడిది ఇబ్బందికరంగా మారింది.