బాహుబలి-2లో జాతీయ స్థాయిలో స్టార్ అయిపోయాడని సాహోలో ప్రభాస్ సరసన నటించడానికి ఒప్పుకోలేదు శ్రద్ధాకపూర్. బాలీవుడ్ కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తున్నారని సాహోకు కాల్షీట్లు ఇవ్వలేదు. అంతకుమించి ఈ సినిమాలో తన పాత్రకు కూడా ప్రధాన్యం ఉంది కాబట్టే సాహోలో నటించేందుకు ఒప్పుకుంది. సాహోలో శ్రద్ధాకపూర్ కు ఎంత వెయిట్ ఇచ్చారో రేపు రిలీజ్ కాబోయే వీడియోతో అందరికీ తెలుస్తుంది.
తెలుగు సినిమాల్లో హీరోయిన్ అంటే 3 సీన్లు, 4 పాటలే. మహాఅయితే ఓ లిప్ కిస్ అన్నట్టు తయారైంది పరిస్థితి. కానీ సాహోలో శ్రద్ధాకపూర్ పాత్ర ఇక్కడితో ఆగిపోదు. హీరోతో సమానంగా ఎలివేట్ అయ్యే క్యారెక్టర్ ఆమె చేస్తోంది. సినిమాలో ఓ గ్రూప్ ను లీడ్ చేసే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా కనిపించబోతోంది శ్రద్ధాకపూర్.
కేవలం కేసులు చేధించే పోలీసాఫీసర్ గా మాత్రమే కాదు, సినిమాలో పలు సందర్భాల్లో సాహో (ప్రభాస్)కు సహాయపడే పాత్రలో కూడా శ్రద్ధాకపూర్ కనిపిస్తుంది. సాహోకు సంబంధించిన మేకింగ్ వీడియో చూస్తే ఈ విషయం అర్థమౌతుంది. అందుకే ఈ పాత్ర చేసేందుకు ఒప్పుకుందామె. శ్రద్ధా పుట్టినరోజు సందర్భంగా రేపు విడుదలకానున్న షేడ్స్ ఆఫ్ సాహో చాప్టర్-2 చూస్తే ఆ విషయం అర్థమౌతుంది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో ఓ షెడ్యూల్ నడుస్తోంది. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నారు.