ఎన్టీఆర్ బయోపిక్ ఫ్లాప్ అవడం కంటే ఇంత ఘోరంగా ఫ్లాపవడమే నందమూరి అభిమానులకి డైజెస్ట్ అవడం లేదు. బాలకృష్ణ అయితే పరాజయ పరాభవాన్ని దాచలేకపోతున్నాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ లేనంత నైరాశ్యం కనిపిస్తోంది. అభిమానులు కూడా దూరమైపోయారా అని అనుమాన పడే పరిస్థితి వచ్చింది. మహానాయకుడు చిత్రానికి కనీస వసూళ్లు రాకపోవడం బాలకృష్ణని మానసికంగా కుదిపేసింది.
అసలు ఈ చిత్రం ఎందుకింత ఘోరంగా పరాజయం పాలయినట్టు? బాలకృష్ణ నటించిన నాసిరకం సినిమా 'జై సింహా' కూడా ముప్పయ్ కోట్ల వరకు షేర్ రాబట్టుకుంది. ఎన్టీఆర్ రెండు భాగాలు కలిపి కూడా అంత సాధించలేదు. ఒక్కసారిగా బాలకృష్ణ చిత్రానికి ఎందుకు క్రేజ్ పడిపోయింది? తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారంలో బాలకృష్ణ ఇచ్చిన స్పీచ్‌లు దేశవ్యాప్తంగా ట్రోల్ అయ్యాయి.
బాలకృష్ణని నవ్వులపాలు చేసిన 'బుల్ బుల్'లాంటి స్పీచ్‌లతో పాటు అభిమానులపై చేయి చేసుకోవడం లాంటి అహంకార ప్రదర్శనలు ఆయన సినిమాలని నేటి తరం లైట్ తీసుకునే పరిస్థితి వచ్చిందా? బాలయ్య సినిమాలేమి చూస్తాంలెమ్మని అధిక శాతం ప్రేక్షకులు భావిస్తున్నారా? ఆయన చిత్రాలని స్వచ్ఛందంగా నిషేధించారా? ఎన్టీఆర్ చిత్రాలు మరీ ఇంత దారుణంగా ఫ్లాప్ అవ్వాల్సినవి అయితే కాదు. కానీ ఇంత దారుణమైన రిజల్ట్ వచ్చినందుకు బాలకృష్ణ ఆత్మ పరిశీలన చేసుకోక తప్పదు.