ఇండియాలో మీటూ ఉద్యమానికి ఓ ఊపు తీసుకొచ్చిన వ్యక్తి తనుశ్రీ దత్తా. కేవలం బాలీవుడ్ ప్రముఖులపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేయడానికే అన్నట్టు అమెరికా నుంచి ముంబయి వచ్చిన ఈ మాజీనటి, అప్పట్లో నానా పటేకర్ పై చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత తిరిగి అమెరికా వెళ్లిపోయిన తనుశ్రీ, ఇప్పుడు మరోసారి కాస్టింగ్ కౌచ్ ను తెరపైకి తీసుకొస్తోంది.
ఈసారి ఆమె ఎవరిపై ఎటువంటి ఆరోపణలు చేయడంలేదు. కేవలం మీటూ ఉద్యమానికి మద్దతుగా ఓ షార్ట్ ఫిలిం తీసి వదుల్తోంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న ఈ షార్ట్ ఫిలిం మార్కెట్లోకి రాబోతోంది. ఇందులో నటించడంతో పాటు దీనికి డైలాగ్స్ కూడా రాసింది తనుశ్రీ దత్తా.
అన్నీ తానై తనుశ్రీ దత్తా తీసిన ఈ షార్ట్ ఫిలిం మరోసారి బాలీవుడ్ ను వణికిస్తోంది. షార్ట్ ఫిలం ద్వారా ఈసారి ఆమె ఎవరిపై ఆరోపణలు సంధిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ షార్ట్ ఫిలిం ద్వారా ఆమె నానా పటేకర్ పై మరోసారి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అంతేకాదు, నానా పటేకర్ తో పాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల్ని పోలిన పాత్రలు కూడా ఇందులో ఉన్నాయట. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో బాలీవుడ్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన తనుశ్రీ దత్తా, ఈ షార్ట్ ఫిలింతో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
అన్నట్టు ఈ షార్ట్ ఫిలింను ఆమె అమెరికా నుంచే సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేస్తుందట. దీంతో కొందరికి ఇంకాస్త ఎక్కువ భయం పట్టుకుంది.