దేశంలో గంటగంటకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈరోజు సాయంత్రం 7 గంటల సమయానికి దేశంలో 953 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అందులో 84 మంది కోలుకున్నారని ప్రకటించిన కేంద్రం.. 21 మంది కరోనా కారణంగా చనిపోయినట్టు వెల్లడించింది.
ఇటు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 65కు చేరింది. అంతేకాదు.. కరోనా కారణంగా తెలంగాణలో తొలి మరణం కూడా సంభవించింది. 74 ఏళ్ల వృద్ధుడు కరోనా లక్షణాలతో మరణించాడు. ఇతడు ఈనెల 14న ఢిల్లీ వెళ్లాడు. తిరిగి 17న నగరానికి వచ్చాడు. తీవ్రమైన శ్వాస సమస్య రావడంతో 20న హాస్పిటల్ లో చేరాడు. ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు మరణించాడు.
వృద్ధుడి మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తరలించి పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడి కుటుంబీకులందర్నీ క్వారంటైన్ లో ఉంచారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న మరో వ్యక్తి ఆరోగ్య పరిస్థితి కూడ విషమంగా ఉందని ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు తెలంగాణలో మద్యం దుకాణాల్ని రేపట్నుంచి తెరుస్తారని, హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్ని రెడ్ జోన్ గా ప్రకటించామంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టంచేశారు. క్వారంటైన్ లో ఉన్న వ్యక్తుల సంఖ్య రోజురోజుకు తగ్గుతోందని.. త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.