కరోనాపై పోరాటానికి దేశవ్యాప్తంగా ప్రముఖులంతా ముందుకొస్తున్నారు. తమకు తోచిన విరాళాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ రతన్ టాటా తన పెద్ద మనసు చాటుకున్నారు. కరోనాపై పోరాటానికి తన ట్రస్ట్స్ నుంచి ఏకంగా 500 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు.
కరోనాపై ప్రభుత్వం జరిపే ఏ తరహా పోరాటానికైనా తన ట్రస్ట్ మద్దతిస్తుందని ప్రకటించిన రతన్ టాటా.. వైరస్ పోరులో అనునిత్య శ్రమిస్తున్న వారికి, పెరుగుతున్న కరోనా కేసుల్ని ఎదుర్కొనేలా శ్వాసకోస సంబంధ వైద్యపరికరాల కొనుగోళ్లకు, బాధితుల్ని వీలైనంత త్వరగా గుర్తించేందుకు మరిన్ని కిట్స్ కొనుగోలు చేయడానికి.. ఇలా ఏ రూపంలో కావాలంటే దానికి 500 కోట్ల రూపాయల నిధుల్ని కేటాయిస్తామని ప్రకటించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజారోగ్యానికి మించిన ప్రాధాన్యం ఇంకొకటి లేదని, ఈ విషయంలో అంతా కలిసికట్టుగా పనిచేయాలని.. అలాంటి ప్రతి చర్యకు టాటా మద్దతు ఉంటుందని విస్పష్టంగా ప్రకటించారు రతన్ టాటా.