దేశంలో కరోనా విస్తరిస్తున్నప్పటి నుంచి దాన్ని అరికట్టడానికి, పారదోలడానికి, దాని పీచమణచడానికి ఎంతోమంది ఎన్నెన్నో సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో అంతా సలహారాయుళ్లే కనబడుతున్నారు. ఏం తింటే, ఏం తాగితే కరోనా మీ దరికి రాదో అదేపనిగా చెబుతున్నారు.
కరోనా గురించి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వందల ఏళ్ళ కిందటే చెప్పాడని, కోరంగి అనే వ్యాధి వచ్చి కోటిమంది మటాష్ అయిపోతారని రాశాడని, అదే కరోనా అని వాట్సప్ లో పెట్టారు. కరోనా గురించి మన పురాణాల్లో ఉందని కొందరు చెబుతున్నారు. ఏ గ్రహాల కారణంగా ఈ మహమ్మారి అవతరించిందో జ్యోతిష్కులు వివరిస్తున్నారు. సనాతన ధర్మాన్ని, ఆచారాలను పాటిస్తూ ఇకనైనా బుద్ధిగా ఉండాలని కొందరు హెచ్చరిస్తున్నారు.
కొందరు కరోనా పోవడానికి, మనం కరోనా బారిన పడకుండా ఉండటానికి ఎలాంటి పూజలు చేయాలో, స్తోత్రాలు, మంత్రాలు చదువుకోవాలో చెబుతున్నారు. కొందరు బుద్ధి చెబుతున్నారు. కొందరు కోప్పడుతున్నారు. కొందరు బెదిరిస్తున్నారు. కొందరు బుజ్జగిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా నిండా, యూట్యూబులో వందల పోస్టులు, వీడియోలు కనబడుతున్నాయి. సందట్లో సడేమియా అన్నట్లు అబద్ధపు మెసేజ్ లు కూడా ఎన్నో దర్శనమిస్తున్నాయి.
సరే … ఇప్పుడు దేశమంతా లాక్ డౌన్ కదా. ఎవ్వడూ ఇంట్లోనుంచి కాలు బయట పెట్టడానికి వీలు లేదు కదా. అయితే కొందరు ఈ లాక్ డౌన్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. పుస్తకాలు చదువుకుంటున్నారు. ఇష్టమైన పనులు చేసుకుంటున్నారు. సినిమాలు చూసుకుంటున్నారు. ఎవరికీ ఏమిష్టమో అది చేసుకుంటున్నారు. అందరూ ఇలా ఉండరు కదా. కొందరికి ఇంట్లో కూర్చొని…కూర్చొని పిచ్చెక్కుతున్నది.
ఏం చేయాలో అర్థం కావడంలేదు. ఇక మందు బాబులకు నాలిక పీకుతున్నది. ఒక్క పెగ్గో, ఒక్క చుక్కో గొంతులో పడితే ఎంత హాయిగా ఉంటుందో అనుకుంటున్నారు. కానీ లాక్ డౌన్లో భాగంగా మందు దుకాణాలు మూసేశారు కదా. అందుకే ఇలాంటి వారి తరపున పాత తరం హీరో రిషీ కపూర్ వకాల్తా పుచ్చుకున్నాడు. రిషీ కపూర్ చాలామందికి తెలిసే ఉంటుంది.
ఆయన ప్రభుత్వానికి యేమని సలహా ఇచ్చాడంటే… సాయంకాలం కొద్దిసేపు మద్యం దుకాణాలు తెరవాలని మందుబాబుల తరపున చెప్పాడు. ఆయనకు ఎందుకు ఇంత జాలి? ఎందుకంటే జనం కరోనా కారణంగా ఇళ్లలోనే ఉంటూ డిప్రెషన్ కు లోనవుతున్నారట…! అంటే బుర్రలు పనిచేయని స్థితిలో ఉన్నారని అర్థం. మరి బుర్ర పనిచేయకపోతే కష్టం కదా. ఈ డిప్రెషన్ కాస్త పిచ్చితనంలోకి దిగితే అది కరోనా కంటే డేంజర్ గా మారుతుంది కదా.
అందుకని మందుబాబులకు ఉపశమనం కలిగించడం కోసం మద్యం దుకాణాలు తెరిచి ఉంచాలని కోరాడు. ప్రస్తుతం మద్యం దుకాణాలు మూసిఉన్నా బ్లాకులో అమ్ముతున్నారని, కాబట్టి లైసెన్సులు ఉన్న షాపులను తెరవాలని కోరాడు. ప్రస్తుతం పోలీసులు, వైద్యులు కూడా టెంక్షన్ గా ఉన్నారని, దాన్నుంచి వారికి విముక్తి కావాలంటే మందు ఒక్కటే మార్గమని రిషీ కపూర్ చెప్పాడు. ఇలా సలహా ఇచ్చినందుకు తనను తప్పుగా అర్ధం చేసుకోవద్దని కోరాడు. సరే … ఇది ఆయన అభిప్రాయం. కాదనలేం కదా.