కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేయడంలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌లో ఉంది. దీంతో దినసరి కూలీలకు పనుల్లేక, పూట గడవక పస్తులుండాల్సిన పరిస్థితి. అలాగే అనాథలు, భిక్షగాళ్ల పరిస్థితి కూడా రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. జన సంచారం లేకపోవడంతో భిక్షగాళ్లు, అనాథలకు పైసా కూడా వేసేవాళ్లు లేరు.
ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి ప్రజల్ని చైతన్యపరిచే క్రమంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకూ ఆధ్యాత్మిక నగరంలో కలియ తిరుగుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. వివిధ కారణాలతో రోడ్డు మీదకి వచ్చిన ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడుతూ…వాళ్ల బాగోగుల గురించి ఆరా తీస్తున్నారు.
అత్యవసరమైతే తప్ప రోడ్డు మీదకి రావద్దని ఆయన చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో నిరాశ్రయులైన భిక్షగాళ్లు, అనాథలు, నిరుపేదలు, దినసరి కూలీలకు కడుపు నింపాలని ప్రజల నుంచి సలహాలు, సూచనలు పెద్ద ఎత్తున వెళ్లాయి. దీంతో ఆయన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్, అడిషనల్ ఈఓ ధర్మారెడ్డితో చర్చించారు.
శనివారం ఒక్కరోజే 20 వేల భోజన పొట్లాలను పంపిణీ చేయించారు. అలాగే ఇక మీదట ప్రతిరోజూ తిరుపతి నగరంలో 50 వేల భోజన ప్యాకెట్లు పంపిణీకి టీడీడీని ఒప్పించారు. ఈ మేరకు సక్రమంగా పంపిణీ చేసేందుకు టీటీడీ యంత్రాంగాన్ని ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి సిద్ధం చేయించారు. విపత్కర పరిస్థితుల్లో ఆకలి తీర్చేలా వెంటనే స్పందించిన ఎమ్మెల్యేతో పాటు టీటీడీ యంత్రాంగాన్ని ప్రజలు అభినందిస్తున్నారు.