మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తమను నిలువునా ముంచారని కొందరు గగ్గోలు పెడుతున్నారు. జగత్ డెయిరీ స్థాపన నిమిత్తం బ్యాంక్ నుంచి రుణం తెచ్చుకునే క్రమంలో తనఖా పెట్టిన ఆస్తులను తమకు కట్టబెట్టడంపై లబోదిబోమంటున్నారు.
జగత్ డెయిరీ రుణాన్ని చెల్లించని నేపథ్యంలో, ష్యూరిటీగా పెట్టిన ఆస్తుల జప్తు హెచ్చరిక ప్రకటనను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేడు పత్రికలకు ప్రకటనలు ఇచ్చింది. వీటిలో తమకు విక్రయించిన ప్లాట్లు, ఇతర ఆస్తులుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు.
ఇలా ఒకరి నుంచి మరొకరికి పెద్ద సంఖ్యలో చేతులు మారినట్టు సమాచారం. రాష్ట్రంలోనే పేరున్న కుటుంబం కావడంతో, వారి నుంచి కొనుగోలు చేసినా ఎలాంటి ఇబ్బందులుండవనే నమ్మకంతో ముందుకెళ్లిన వారు…బ్యాంకు జప్తు ప్రకటనలో తాము కొన్ని ఆస్తులుండటంతో లబోదిబోమంటున్నారు.
ముఖ్యంగా కడప మార్గంలో ఉన్న ఆల్ఫా ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన 3.50 ఎకరాలు, అలాగే భూమా బ్రహ్మానందరెడ్డి పేరుతో ఆళ్లగడ్డలోని బాలాజీ టౌన్షిప్, విశ్వరూప్నగర్, జీసస్ క్రీస్త్నగర్లోని 9136.40 చ.గజాలు విస్తీర్ణం ఉన్న 39 ఇళ్ల స్థలాలను విక్రయించడం ఇప్పుడు ఆందోళనకు కారణమైంది.
ముఖ్యంగా ఉమ్మడి ఆస్తి కావడంతో భూమా బ్రహ్మానందరెడ్డి నుంచి భూమా అఖిలప్రియ జీపీఏ రాయించుకుని, విక్రయించినట్టు తెలుస్తోంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి దాదాపు 300 మంది చేతులు మారినట్టు తెలుస్తోంది. తాజాగా జప్తు హెచ్చరిక నేపథ్యంలో ఈ విషయం తమ వద్ద దాచి అఖిలప్రియ మోసగించారని కొనుగోలుదారులు వాపోతున్నారు.
ఇది పచ్చి మోసం చేయడమే అని విమర్శిస్తున్నారు. ఒకవైపు అమ్మిన భూములతో తమకు సంబంధం లేదని భూమా అఖిలప్రియ అంటున్నారని సమాచారం. ఇలాగైతే తమ గోడు పట్టించుకునే వారెవరనే ఆవేదన వినవస్తోంది.