ప్రధాని మోదీ అంటే జగన్‌కు భయం? కేసుల్లో ఉన్న జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారని పదేపదే విమర్శలు వస్తుండడం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశంలోని ముఖ్యమంత్రు లంతా ఏకతాటిపైకి రావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలు రాయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇలాంటి లేఖలు ఏ మమతా బెనర్జో, కేజ్రీవాలో రాసి ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ తమకెంతో నమ్మకంగా ఉన్న వైఎస్ జగన్ ఒక్కసారిగా సీఎంలకు లేఖ రాయడం కేంద్ర ప్రభుత్వానికి కూడా షాక్ ఇచ్చినట్టైంది.
కరోనా టీకాల సరఫరా విషయంలో ఒకే గొంతుక వినిపించాలని కోరుతూ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వైఎస్ జగన్ లేఖలు రాయడాన్ని మామూలు విషయంగా తీసుకోవద్దని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ వైఖరిపై జగన్ దిక్కార స్వరాన్ని ఈ లేఖలు ప్రతిబింబిస్తున్నాయి. కరోనా కట్టడిలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం, అహంకారపూరిత వైఖరిపై జగన్ ధిక్కార స్వరానికి ఈ లేఖలు నిదర్శనంగా చెబుతున్నారు.
గ్లోబల్ టెండర్లు పిలిచినా ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదని కేరళ సీఎం పినరయి విజయన్‌కు రాసిన లేఖలో జగన్ స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రాల్లో వ్యాక్సిన్ లభ్యతలో తలెత్తుతున్న ఇబ్బందులను కేంద్ర దృష్టికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రులంతా ఒకే గొంతుక వినిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
వ్యాక్సినేషన్ ప్రక్రియను కేంద్రమే పూర్తిగా చేపట్టాలని అందరం కోరదామని తాను రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్లోబల్ టెండర్ల ఆమోదం కేంద్రం చేతుల్లో ఉందని ప్రస్తావించారు. వ్యాక్సిన్ లభ్యత విషయంలో కేంద్రం, రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తేలా పరిస్థితి మారుతోందని ఆయన పేర్కొన్నారు. అమ్మ పెట్టదు, అడుక్కోనివ్వదు అనే చందంగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉందని జగన్ పరోక్షంగా చెప్పకనే చెప్పారు.
కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఆశయంతో విదేశాల నుంచి టీకాలు తెప్పించే క్రమంలో గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ సర్కార్ కూడా ఇదే పద్ధతిని అనుసరించింది.
దేశంలోని మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే పంథాను అనుసరించాయి. అయితే టీకాలను రాష్ట్రాలకు ప్రత్యేకంగా సరఫరా చేసేది లేదని, కేవలం దేశానికి మాత్రమే అందజేస్తామని ఇతర దేశాల కంపెనీలు స్పష్టం చేశాయి. దీంతో వ్యాక్సినేషన్‌ను పూర్తి చేయాలనే పట్టుదల రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నప్పటికీ, గ్లోబల్ టెండర్లు వర్కౌట్ కాకపోవడంతో చేతులు కట్టేసినట్టైంది.
మరో వైపు కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి తాము మూల్యం చెల్లించాల్సి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసించేందుకు జగన్ ప్రభుత్వం ముందుకు రావడం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆశ్చర్యపరుస్తోంది.
వ్యాక్సిన్ సరఫరా విషయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుందామని జగన్ పిలుపునివ్వడం గమనార్హం. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో బీజేపీ వైఖరిపై జగన్‌లో వస్తున్న మార్పునకు నిదర్శనంగా సీఎంలకు రాసిన లేఖలే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.