కౌశ‌ల్ భార్య‌కు చేదు అనుభ‌వం

బిగ్‌బాస్ సీజ‌న్‌-2 విజేత కౌశ‌ల్ మండా భార్య నీలిమ త‌న‌కు యూకేలో చేదు అనుభ‌వం ఎదురైన‌ట్టు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆమె విడుద‌ల చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.…

బిగ్‌బాస్ సీజ‌న్‌-2 విజేత కౌశ‌ల్ మండా భార్య నీలిమ త‌న‌కు యూకేలో చేదు అనుభ‌వం ఎదురైన‌ట్టు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆమె విడుద‌ల చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కౌశ‌ల్ బిగ్‌బాస్ విన్న‌ర్ కావ‌డం వెనుక నీలిమ పోషించిన పాత్ర గురించి అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చే జ‌రిగింది.

రెండు రోజుల క్రితం త‌న భార్య అనారోగ్యం గురించి కౌశ‌ల్ ఓ పోస్టు పెట్టారు. దీంతో కౌశ‌ల్ భార్య‌కు ఏమైందంటూ సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రిగింది. ఈ నేప‌థ్యంలో ఆమె ఓ వీడియో విడుద‌ల చేయ‌డంతో ఉత్కంఠ తెర‌దింపిన‌ట్టైంది. ముందుగా త‌న భార్య గురించి కౌశ‌ల్ పెట్టిన పోస్టు ఏంటో చూద్దాం.

'ఏదో సాధించాలని వెళ్లిపోయావు.. ఏదో ఒకటి సాధించాలని జీవితంతో పోరాడుతున్నావు, నీకున్న ధైర్యంతో అది సాధిస్తావని తెలుసు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా, లవ్‌ యూ, మిస్‌ యూ నీలిమ' అంటూ సోషల్‌ మీడియాలో కౌశ‌ల్ వరుస పోస్టులు పెట్టాడు.

నీలిమ తాజాగా విడుద‌ల చేసిన‌ సెల్ఫీ వీడియోతో కౌశ‌ల్ పోస్టుకు స‌మాధానం దొరికిన‌ట్టైంది. నీలిమ ఏదో ప‌నిపై లండ‌న్‌కు వెళ్లారు. అక్క‌డ కోవిడ్ బారిన ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఆమె కోలుకుంటున్నారు. అయితే ఇంగ్లండ్‌లో అందిస్తున్న ట్రీట్‌మెంట్ తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు. తాను ఎంతో గొప్ప‌గా ఊహించుకున్న దేశంలో ఇలాంటి వైద్యం ఏంట‌ని ఆమె ప్ర‌శ్నించారు. నీలిమ రిలీజ్ చేసిన వీడియోలో ఏముందంటే…

“నేను యూకేలో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడ పనిచేసే చోట ఓ వ్య‌క్తి వ‌ల్ల ఏడు రోజుల క్రితం నాకు కరోనా సోకింది. ఇండియాలో చాలా దారుణమైన, భయంకర పరిస్థితులు ఉన్నాయని అనుకుంటారు. కానీ ఇక్కడే ఘోరంగా ఉంది. కోవిడ్ బారిన ప‌డిన నాకు ఊపిరి తీసుకోవ‌డం క‌ష్టంగా మారింది. ఛాతీలో నొప్పితో పాటు ఆయాసం కూడా వచ్చింది. 

నా పరిస్థితి బాగోలేదు, ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయని వైద్యుల‌కు చెప్తే వారు కేవలం పారాసిటమాల్‌ టాబ్లెట్‌ మాత్రమే ఇచ్చారు. అంత‌కు మించి పెద్దగా పట్టించుకోలేదు. పైగా క‌రోనా ల‌క్ష‌ణాలు అట్లే ఉంటాయ‌ని, ఎదుర్కోవాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు” అని నీలిమ వాపోయారు.

“యూకేలో ట్రీట్‌మెంట్‌ గొప్పగా ఉంటుందనుకున్నా. నా స్వీయ అనుభ‌వం అందుకు విరుద్ధంగా ఉంది. నా జీవితంలో ఇది నిజంగా ఓ చేదు అనుభవం. ఇదే మ‌న‌దేశంలో అయితే వెంట‌నే వైద్యం అందిస్తారు. ఇక్కడలా కాదు. నాకు చాలా భయమేసింది. ఇండియాలోనే కరోనాకు మంచి వైద్యం అందిస్తారు. కాబట్టి మీరెవరూ భయపడొద్దు. మీ అందరి ప్రార్థనల వల్ల ఇప్పుడు నేను బాగానే ఉన్నాను. త్వరలోనే భారత్‌కు తిరిగొస్తాను” అని నీలిమ చెప్పుకొచ్చారు. 

భార‌తీయ వైద్యం గొప్ప‌త‌నాన్ని చాటి చెప్పేందుకు నీల‌మ ప్ర‌య‌త్నించార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. నీలిమ త్వ‌ర‌గా కోరుకోవాల‌ని ఆకాంక్షిద్దాం.