సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయ్యన్నపాత్రుడుకి కోపంతో పాటు వెటకారం కూడా ఎక్కువే. అందుకే ఆయన విమర్శలు కూడా అలాగే ఉంటాయి. చంద్రబాబు కంటే టీడీపీలో తానే సీనియర్ అని చెప్పుకునే అయ్యన్న మాటల్లో మాత్రం ఒక్కోసారి బాబు గారినే మించి పోతూ కోటలు దాటించేస్తారు.
ఇక తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు మోడీని పొగిడేందుకు ఇంతకంటే మంచి తరణం రాదు అనుకుంటూ ఏకంగా లేఖల్లో ప్రేమంతా గుదిగుచ్చేస్తున్నారు. మరి ఆయన పార్టీలో పెద్ద తమ్ముడు అయ్యన్న కూడా తగ్గితే ఏ మాత్రం బాగోదు అనుకున్నారేమో మోడీ ఈజ్ గ్రేట్ అనేశారు. ఆయన అత్యద్భుతమైన ప్యాకేజిని లాక్ డౌన్ సమయంలో ప్రకటించి దేశాన్ని ఆదుకున్నారని కితాబు ఇచ్చారు
ఇంతవరకూ చెప్పి ఆగిపోతే అయ్యన్న ఎలా అవుతారు, మధ్యలోకి జగన్ని తీసుకువచ్చారు. మోడీ మంచి ప్యాకేజి ఇస్తే జగన్ కి ఇవ్వడానికేమైంది అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ కూడా మంచి ప్యాకేజి పేదలకు ప్రకటించాల్సిందేనని డిమాండ్ చేశారు.
కొసమెరుపు అన్నట్లుగా కరోనా వైరస్ తీవ్రత గురించి సామాన్య జనానికి అర్ధమైనది కూడా సీఎం హోదాలో జగన్ కి అర్ధం కాలేదన్నది అందరికీ అర్ధమైందని ఏదేదో మాట్లాడేశారు పెద్దాయన. అసలు ఇంతకీ కరోనా గురించి అయ్యన్నకు అర్ధమైంది ఏపాటిదోనని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.