కరోనా వైపరీత్యం వేళ ప్రభుత్వ సహాయ నిధులకు దక్షిణాది తారలు విరాళాలు ప్రకటిస్తూ ఉన్నారు. ప్రముఖ హీరోలు ఈ విషయంలో స్పందిస్తున్నారు. మంచి స్థాయిలో వీరి డొనేషన్లు నమోదయ్యాయి. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు వీరు డొనేట్ చేశారు. ఈ విషయంలో వీరిని మెచ్చుకుని తీరాలి. అడపాదడపా దక్షిణాది తారలు ఇలాంటి విరాళాలు ఇస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కరోనా వేళ కూడా తమకు ఉన్నంత మేరకు వారు విరాళాలు ఇస్తున్నారు. ఇవ్వకపోయినా నిగ్గదీసి అడిగే వారు లేరు. అయినా సినిమా వాళ్లు బాగానే స్పందిస్తూ ఉన్నారు.
ఇదే విషయాన్ని ఉత్తరాది నెటిజన్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. సౌతిండియన్ స్టార్ హీరోలు కరోనా విపత్తు వేళ ప్రభుత్వ సహాయ నిధికి ప్రకటించిన విరాళాలను వారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ప్రత్యేకించి తెలుగు హీరోల పేర్లను వారు ప్రస్తావిస్తున్నారు. ప్రభాస్, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వాళ్లు ఏపీ-తెలంగాణ ప్రభుత్వాల కు విరాళ నిధిని ప్రకటించారని, అయితే బాలీవుడ్ హీరోలు మాత్రం స్పందించడం లేదంటూ అక్కడి నెటిజన్లు సోషల్ మీడియాలో కడిగేస్తూ ఉన్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోలుగా చలామణి అయ్యే ముగ్గురు ఖాన్లు కానీ, అక్కడ దేశ భక్తి, సోషల్ రెస్పాన్సిబులిటీ అంటూ సినిమాలు తీసి క్యాష్ చేసుకునే హీరోలు కానీ ఎవ్వరూ ఇప్పటి వరకూ విరాళాలు ప్రకటించింది లేదు. ఈ నేపథ్యంలో వారి పేర్లను ప్రస్తావిస్తూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సినిమాలతో తమను క్యాష్ చేసుకునే హీరోలు.. ఇలాంటి సమయంలో మాత్రం స్పందించడం లేదంటూ.. వారు ఇంటర్నెట్ ద్వారా విరుచుకుపడుతూ ఉన్నారు. అయినా ఇప్పటి వరకూ బాలీవుడ్ తారల నుంచి ఈ విషయంలో స్పందన లేకపోవడం గమనార్హం.