విజ‌య‌మ్మ స్పీచ్ సూప‌ర్‌ హిట్‌…!

రాజ‌శేఖ‌ర‌రెడ్డిని అభిమానించే ప్ర‌తి హృద‌యానికి , త‌న‌ను, త‌న బిడ్డ‌ల్ని అక్కున చేర్చుకున్న ప్ర‌తి ఒక్క‌రికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా అంటూ విజ‌య‌మ్మ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. ప్లీన‌రీలో విజ‌య‌మ్మ ప్ర‌సంగం ఎలా సాగిందంటే… “రాజ‌శేఖ‌ర‌రెడ్డి నా…

రాజ‌శేఖ‌ర‌రెడ్డిని అభిమానించే ప్ర‌తి హృద‌యానికి , త‌న‌ను, త‌న బిడ్డ‌ల్ని అక్కున చేర్చుకున్న ప్ర‌తి ఒక్క‌రికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా అంటూ విజ‌య‌మ్మ ప్ర‌సంగాన్ని ప్రారంభించారు. ప్లీన‌రీలో విజ‌య‌మ్మ ప్ర‌సంగం ఎలా సాగిందంటే… “రాజ‌శేఖ‌ర‌రెడ్డి నా వాడే కాదు మీ అంద‌రి వాడు. జ‌గ‌మంత కుటుంబంగా ప్ర‌తి మ‌నిషిని ఆయ‌న ప్రేమించాడు. మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఇక లేరు అంటే కొన్ని గుండెలు ఆగిపోయాయి. ఇక రారు అంటే 700 మంది ప్రాణాలు విడిచారు.

జ‌గ‌న్‌బాబు అంచెలంచెలుగా నాయ‌కుడిగా ఓర్పుతో, స‌హ‌నంతో, అచంచల విశ్వాసంతో, గుండె నిండా ధైర్యంతో, పేద‌ల మీద మ‌మ‌కారంతో, రైతుల మీద కొండంత ప్రేమ‌తో, నేల త‌ల్లిమీద గౌర‌వంతో ఒక్కో మెట్టు కాలిన‌డ‌క‌న ఎదిగాడు. బైబిల్‌లో ఒక వాక్యం ఉంది. త‌న‌ను తాను త‌గ్గించుకున్న వాడు హెచ్చింప‌బ‌డుతాడ‌ని. ఆ దైవ వాక్యాన్ని న‌మ్మి ఆచ‌రించి …కృషితో నాస్తి దుర్భిక్షం అనే వేద వాక్యాన్ని త్రిక‌ర‌ణ‌శుద్ధితో అమ‌లు చేసి నాలుగున్న‌ర ద‌శాబ్దాల చ‌రిత్ర క‌లిగిన ప్ర‌త్య‌ర్థి గొంతు ఆరిబోయేలా నా బిడ్డ చేశాడు.

ఈ రోజు మీ అంద‌రి ప్రేమ‌, మీ అంద‌రి అభిమానం సంపాదించిన నా కొడుకుని చూసి చాలా చాలా గ‌ర్వ‌ప‌డుతున్నా. జ‌గ‌న్ త‌ల్లిగా, రాజ‌శేఖ‌ర‌రెడ్డి భార్య‌గా, వైఎస్సార్‌సీపీ అధ్య‌క్షురాలిగా నేను నా బిడ్డ‌ని చూసి గ‌ర్వ‌ప‌డుతున్నా. త‌న మ‌న‌సుతో చేసే ఈ ప‌రిపాల‌న‌ను నా క‌ళ్లారా చూస్తున్నాను. జ‌గ‌న్‌కు అధికారం ఈ స్థాయిలో వ‌చ్చిందంటే ఆయ‌న క‌ష్టం చాలా చాలా వుంది. క‌ష్టాలు, నింద‌లు, అవ‌మానాలు గుర్తు చేసుకుంటే చాలా బాధ క‌లుగుతుంది. కానీ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కొడుకుగా అడుగు పెట్టి … నేను మీతో వుంటాను, మాట‌కు క‌ట్టుబ‌డి వుంటాన‌నే న‌మ్మ‌కం క‌లిగించి ముఖ్య‌మంత్రి అయ్యాడు.

యువ నాయ‌కుల‌కు జ‌గ‌న్ రోల్ మోడ‌ల్‌. జ‌గ‌న్ ఒక మాస్ లీడ‌ర్‌. భార‌త‌దేశంలో వైఎస్ కుటుంబం ప‌డిన‌న్ని క‌ష్టాలు, ఆయ‌న బిడ్డ‌లు ప‌డిన క‌ష్టాలు ఎవ‌రూ ప‌డ‌లేదు. వాళ్ల‌కు ఇంత మెజార్టీని దేవుడు, మీరు ఇచ్చారు. విజ‌యం వెనుక జ‌గ‌న్ క‌ష్టం, ఆయ‌న బాధ‌, అవ‌మానం, ధైర్యం, ప‌ట్టుద‌ల, మాట త‌ప్ప‌న‌నే న‌మ్మ‌కాన్ని క‌లిగించ‌డ‌మే.

2011లో మొద‌టి ప్లీన‌రీలో ఒక మాట చెప్పాను. నా బిడ్డ‌ని మీకు అప్ప‌గిస్తున్నా, మీరే న‌డిపించుకోండ‌ని చెప్పాను. ఆ బిడ్డ‌ని చాలా గొప్ప‌గా మీ ప్రేమ‌తో, అభిమానంతో , ఆప్యాయత‌తో గొప్ప‌గా న‌డిపించుకున్నారు. ఆ కృత‌జ్ఞ‌త నా అణువ‌ణువులో వుంద‌ని చెబుతున్నా. జ‌గ‌న్ ఓదార్చ‌డానికి వ‌స్తే, ఆయ‌న్ను ఓదార్చ‌డానికి తండోప‌తండాలుగా వ‌చ్చారు. జ‌గ‌న్ జైల్లో వున్న‌ప్పుడు ష‌ర్మిల‌మ్మ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మైంది.

జ‌గ‌న‌న్న వ‌దిలిన బాణం అంటూ ష‌ర్మిల పాద‌యాత్ర‌గా మీ వ‌ద్ద‌కు వ‌చ్చింది. ష‌ర్మిల పాద‌యాత్ర‌కు పోయేరోజు చాలాచాలా బాధేసింది. చాలా భ‌య‌మేసింది కూడా. ఎందుకంటే ఉన్న‌ది ఇద్ద‌రు బిడ్డ‌లు. ఒక బిడ్డ చేయ‌ని త‌ప్పున‌కు జైల్లో వుంటే, ఇంకో బిడ్డ ఆడ‌బిడ్డ‌. రోడ్డు మీద‌కి వెళుతుంద‌ని భ‌య‌ప‌డ్డా. కానీ మీ అంద‌రి ప్రేమ‌, అభిమానం మా బిడ్డ‌ను 3వేల కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచేలా చేసింది. ఏ సంఘ‌ట‌న‌నూ జీవితంలో మ‌రిచిపోను. 

ఆ త‌ర్వాత జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కూడా ఎన్నెన్నో అవ‌మానాలు. అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్ 4 వేల కిలోమీట‌ర్ల‌కు పైగా న‌డిచాడంటే… మీ అభిమానం, ప్రేమ న‌డిపించింది. ఇలా ప్ర‌తిసంఘ‌ట‌న‌లో నా జీవితంలోనూ, నా బిడ్డ‌ల జీవితంలోనూ మీరు ఉన్నారు” అంటూ ఆమె ఆర‌గంట‌కు పైగా హృద‌యాల‌ను అతుక్కునేలా ప్ర‌సంగించారు. వైసీపీ ఆవిర్భావం, త‌న కుమారుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి కావ‌డం వెనుక ప్ర‌జ‌లున్నార‌ని , వారికి స‌ర్వ‌దా కృత‌జ్ఞురాలినై వుంటాన‌ని ఆమె భావోద్వేగంతో చెప్పుకొచ్చారు.

విజ‌య‌మ్మ‌కు ముందు వైసీపీ అధ్య‌క్ష హోదాలో జ‌గ‌న్ ప్రారంభోప‌న్యాసం చేశారు.  2009, సెప్టెంబర్‌ 25న పావురాలగుట్టలో సంఘర్షణ మొదలైందన్నారు. ఓదార్పు యాత్రతో పార్టీ ఒక రూపం దాల్చింద‌న్నారు.. వైఎస్సార్‌ ఆశయాల సాధన కోసం పార్టీ ఆవిర్భవించిందన్నారు. త‌నను ప్రేమించి, త‌న‌కు వెన్నుదన్నుగా నిలబడ్డ కోట్లాది మంది అభిమానులకు, ప్రజలకు సెల్యూట్ చేస్తున్నా అన్నారు. ఇక టీడీపీపై ఎప్ప‌ట్లా పాత విమ‌ర్శ‌లే చేశారు.  ప్రజలు నిలదీస్తారేమోనని టీడీపీ మేనిఫెస్టోని మాయం చేసిందన్నారు. వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను చూడటానికే టీడీపీ భయపడే పరిస్థితి వచ్చిందన్నారు.

దుష్ట‌చ‌తుష్ట‌యం అంటూ చంద్ర‌బాబు, ఎల్లో మీడియా సంస్థ‌లు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ల‌పై విమ‌ర్శ‌లు చేశారు. అయితే విజ‌య‌మ్మ ప్ర‌సంగం ఆసాంతం ఆక‌ట్టుకుంది. విజ‌య‌మ్మ నేరుగా పార్టీ శ్రేణుల వైపు చూస్తూ మాట్లాడారు. కానీ జ‌గ‌న్ మాత్రం పేప‌ర్ చూస్తూ, త‌ల‌వంచుకుని, అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే జ‌నం వైపు చూడ‌డం క‌నిపించింది. మొత్తానికి ప్లీన‌రీలో విజ‌య‌మ్మ స్పీచ్ సూప‌ర్ హిట్ అనిపించుకుంది. జ‌గ‌న్ ప్ర‌సంగం వైసీపీ శ్రేణుల‌కు ఎలా అనిపించినా, సామాన్య జ‌నం మాత్రం… ప్చ్ అంటూ పెద‌వి విరిచేలా సాగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.