ఆశయం కోసం వేటాడే పులి.. జగన్: రోజా

ప్లీనరీ వేదికగా సాగిన మంత్రి రోజా ప్రసంగం.. సభికులను ఉర్రూత లూగించింది. ఆద్యంతమూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ.. ఎన్ని అవాంతరాలు దాటుకుంటూ, పోరాటాలు సాగించుకుంటూ ఈ దశకు పార్టీని జగన్…

ప్లీనరీ వేదికగా సాగిన మంత్రి రోజా ప్రసంగం.. సభికులను ఉర్రూత లూగించింది. ఆద్యంతమూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ.. ఎన్ని అవాంతరాలు దాటుకుంటూ, పోరాటాలు సాగించుకుంటూ ఈ దశకు పార్టీని జగన్ తీసుకువచ్చారో ప్రజలకు చెప్పడమే లక్ష్యంగా సాగింది. 

ఆవేశంతో వేటాడే పులిని చూసి ఉంటారు.. ఆకలితో వేటాడే పులిని చూసిఉంటారు.. అధికారం కోసం వేటాడే పులిని మీరు చూసి ఉంటారు.. కానీ ఆశయం కోసం పోరాడే పులి.. ఈ పులివెందుల బిడ్డ జగనన్న అంటూ ఆమె అభివ్యక్తీకరించడంతో సబికుల్లో హర్షధ్వానాలు మిన్నుముట్టాయి.

భారతదేశాన్నే గడగడలాడించిన సోనియా గాంధీని గడగడలాడించిన మహానాయకుడు, వెన్నుపోటులకు పేరుమోసిన చంద్రబాబునాయుడు వెన్నులో వణుకు పుట్టించిన నాయకుడు మన జగనన్న అంటూ ఆమె ప్రస్తుతించారు. 

మూడేళ్ల ముందు.. రాఖీ పండగ నాడు.. జగనన్నకు తాను బంగారు రాఖీ కట్టి.. అన్న ముఖ్యమంత్రి అయి.. రాష్ట్రంలోని మహిళలకు బంగారు భవిష్యత్తు అందించాలని కోరుకున్నానని.. తన ప్రార్థనను దేవుడు విన్నాడని.. అన్నను ముఖ్యమంత్రిని చేశాడని రాష్ట్రమంతా అభిలషించినట్టుగానే.. మహిళలకు బంగారు భవిష్యత్తు అందివచ్చిందని ఆమె ప్రకటించారు. 

సాధారణంగా అమ్మను మించిన దైవం లేదని అందరూ అంటూ ఉంటారని, కానీ.. ఈ రాష్ట్రంలోని మహిళలందరూ ఇవాళ జగనన్నను మించిన ధైర్యం లేదని అనుకుంటున్నారని ఆమె ప్రకటించారు. మహిళల రక్షణకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. 

జగన్ ప్రభుత్వం సారథ్యంలో అనేకానేక పథకాలను గురించి ఆమె విపులంగా మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటేనే పౌరుషానికి ప్రతీక అని.. ప్లీనరీ వేదికగా జగనన్న ఎగరేసిన పార్టీ జెండా.. ఆయన ఆత్మగౌరవానికి ప్రతిబింబం అని.. ఆమె ప్రకటించారు.