వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రాజీనామాపై ఎలా స్పందించాలో టీడీపీకి క్లారిటీ లేదు. వైఎస్ జగన్, ఆయన కుటుంబం, పార్టీపై చర్చ లేకపోతే ఎల్లో చానళ్లకు కంటెంటే ఉండదు.
తెలంగాణలో కూతురు వైఎస్ షర్మిలకు అండగా నిలవడానికి వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్న విజయమ్మ ప్రకటించారు. ఇదేమీ రహస్యం కాదు. ఒక పార్టీ గౌరవాధ్యక్షురాలిగా వుంటూ, మరో పార్టీ తరపున వకల్తా పుచ్చుకోవడం సరైంది కాదని విజయమ్మ భావించారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
ఈ నేపథ్యంలో నిన్న చెల్లి, నేడు తల్లిని జగన్ పక్కన పెట్టారంటూ ఎల్లో మీడియా తన మార్క్ కథనాలను వండివార్చుతోంది. ఈ నేపథ్యంలో విజయమ్మ రాజీనామాపై తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందిస్తూ…. రాజీనామా చేస్తానని చెప్పడానికే విజయమ్మ ప్లీనరీకి వచ్చారన్నారు.
వైసీపీలో విజయమ్మ ఎప్పుడూ కీలకపాత్ర పోషించలేదన్నారు. పార్టీ సమావేశాల్లోనూ ఆమె ఎప్పుడూ పాల్గొనలేదన్నారు.
పార్టీలో తన తల్లి అడ్డును జగన్ తొలగించుకున్నారని అనివ విమర్శించారు. అవసరం తీరగానే.. తల్లిని, చెల్లిని పార్టీకి దూరం పెట్టారని అనిత విమర్శించారు.
సీఎం కుర్చీలో కూర్చోడానికి జగన్ ఏమైనా చేస్తారని వంగలపూడి అనిత అన్నారు. పార్టీలో కీలకపాత్ర పోషించని, సమావేశాల్లో ఏనాడు పాల్గొనలేదని చెబుతున్న అనిత… మరి ఆమెను జగన్ ఏ విధంగా దూరం పెట్టారో చెప్పాలని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
అనిత లాజిక్ లేకుండా, ఏదో పడితే అది మాట్లాడుతున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కుమార్తె షర్మిలను కూడా సీఎం పీఠంపై చూడడానికే ఆమెకు అండగా నిలిచేందుకు విజయమ్మ వెళుతున్నారని వైసీపీ నేతలు చెప్పడం విశేషం.