వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టులో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్లో గచ్చిబౌలి పోలీస్స్టేషన్లో తనతో పాటు తన కుమారుడు భరత్పై నమోదు చేసిన కేసు కొట్టి వేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో రఘురామకృష్ణంరాజు క్వాష్ పిటిషన్ను దాఖలు చేశారు.
విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు కారులో ఎక్కించుకెళ్లి రఘురామ ఇంటికి తీసుకెళ్లి, చితకబాదారని ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్కే ఫరూక్బాషా గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనలో సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ ఘటనకు సంబంధించి రఘురామ, ఆయన కుమారుడు భరత్, పీఏ శాస్త్రి, సీఆర్పీఎఫ్ ఏఎస్ఐ, కానిస్టేబుల్లపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కొట్టివేయాలని రఘురామకృష్ణంరాజు, ఆయన కుమారుడు సంయుక్తంగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో రఘురామకు వేర్వేరు ఘటనల్లో న్యాయస్థానాల్లో వరుస ఎదురు దెబ్బలు తగులుతుండడం చర్చనీయాంశమైంది. ఇటీవల భీమవరంలో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనేందుకు వెళ్లానని, ఏపీ పోలీసుల భద్రత కల్పించాలని కోరుతూ అక్కడి హైకోర్టును రఘురామ ఆశ్రయించారు.
ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాల రక్షణలో ఉన్న రఘురామకు అంతకంటే రక్షణ ఏముంటుందని హైకోర్టు నిలదీయడం తెలిసిందే. అలాగే ఏపీ ఆర్థిక వ్యవహారాలపై హైకోర్టు రఘురామకు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే.
తాజాగా గచ్చిబౌలి పోలీసులు నమోదు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయడం ద్వారా… రఘురామకు కాలం కలిసి రాలేదేమో అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.