ఎమ్మెల్యేకే ఈ దుస్థితి ఎదురైతే…

ములుగు ఎమ్మెల్యే సీత‌క్కకు తెలంగాణ పోలీసులు ఆవేద‌న మిగిల్చారు. సీత‌క్క‌ అంటే తెలంగాణ‌లో పార్టీల‌కు అతీతంగా గౌర‌విస్తారు. విప్ల‌వ రాజ‌కీయ నేప‌థ్యం, ప్ర‌జాసేవ‌లో నిబ‌ద్ధ‌త సీత‌క్క‌కు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చాయి.  Advertisement ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు…

ములుగు ఎమ్మెల్యే సీత‌క్కకు తెలంగాణ పోలీసులు ఆవేద‌న మిగిల్చారు. సీత‌క్క‌ అంటే తెలంగాణ‌లో పార్టీల‌కు అతీతంగా గౌర‌విస్తారు. విప్ల‌వ రాజ‌కీయ నేప‌థ్యం, ప్ర‌జాసేవ‌లో నిబ‌ద్ధ‌త సీత‌క్క‌కు ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చాయి. 

ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌కు త‌గ్గ‌ట్టుగానే ఆమె సేవ‌కు అంకిత‌మై ప‌ని చేస్తున్నార‌నే అభిప్రాయం ఉంది. కోవిడ్ విజృంభిస్తున్న దుర్భ‌ర స్థితిలో ఆక‌లితో ఉన్న‌ అడ‌వి బిడ్డ‌ల క‌డుపు నింపేందుకు స్వ‌యంగా స‌రుకులు మోస్తూ అడ‌విబాట ప‌ట్టి అంద‌రి దృష్టి ఆక‌ర్షించారు. అంతేకాదు, ఎమ్మెల్యే అంటే సీత‌క్క‌లా ఉండాల‌నే స్ఫూర్తి నింపారు.

అలాంటి ప్ర‌జాద‌ర‌ణ క‌లిగిన సీత‌క్క‌కు అవ‌మానం జ‌రిగింది. ఎమ్మెల్యే అయిన త‌న‌కే ఇలాంటి దుస్థితి ఎదురైతే, ఇక సామాన్య ప్ర‌జ‌ల ఇబ్బందుల మాటేంట‌నే ప్ర‌శ్న‌లను ఆమె సంధించారు. ములుగు ఎమ్మెల్యే సీత‌క్క త‌ల్లి క‌రోనాబారిన ప‌డ్డారు. త‌ల్లి ఆరోగ్యం విష‌మించ‌డంతో హైద‌రాబాద్‌లోని ఓ ఆస్ప‌త్రిలో చేర్చారు. ఆమెకు ర‌క్తం అవ‌స‌ర‌మైంది. దీంతో ములుగు నుంచి సీత‌క్క కుటుంబ స‌భ్యుల‌ను మ‌ల్కాజిగిరి డీసీపీ ర‌క్షిత అరగంట పాటు అడ్డుకున్నారు.

తాము ఫ‌లాన అని, అత్య‌వ‌స‌ర వైద్యంలో భాగంగా ర‌క్తం ఇచ్చేందుకు వెళుతున్నా ప‌ట్టించుకోలేద‌ని సీత‌క్క మండిప‌డ్డారు. తాను వీడియో కాల్ చేసి మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించినా డీసీపీ అందుబాటులోకి రాలేద‌ని సీత‌క్క వాపోయారు. అంతేకాదు, త‌మ కుటుంబ స‌భ్యుల‌ను నానా మాట‌ల‌న్నార‌ని ఆమె ఆరోపించారు. 

మ‌ల్కాజిగిరి డీసీపీ ర‌క్షిత  క‌నీస మాన‌వ‌త్వం లేకుండా ప్ర‌వ‌ర్తించార‌ని సీత‌క్క తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఒక ఎమ్మెల్యే అయిన త‌న‌కే ఇలా జ‌రిగితే సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏంట‌ని ఆమె ఆవేద‌న‌తో ప్ర‌శ్నించడం గ‌మ‌నార్హం. 

మ‌ల్కాజి గిరి డీసీపీ ర‌క్షిత వ్య‌వ‌హ‌రించిన తీరుపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అత్య‌వ‌స‌ర వైద్యానికి కూడా అనుమ‌తించ‌రా? అని నీలదీస్తున్నారు. సీత‌క్క ఆవేద‌న‌, ఆగ్ర‌హం, ఆరోప‌ణ‌ల‌పై తెలంగాణ పోలీసుశాఖ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.