విజ‌య‌మ్మ భావోద్వేగం

వైసీపీకి ఆ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ షాక్ ఇచ్చారు. గౌర‌వాధ్య‌క్షురాలిగా త‌ప్పుకుంటున్నట్టు వైసీపీ ప్లీన‌రీ వేదిక‌గా ఆమె తీవ్ర భావోద్వేగంతో ప్ర‌క‌టించారు. తాను పార్టీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించే సంద‌ర్భంలో ఆమె స్వ‌రం…

వైసీపీకి ఆ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైఎస్ విజ‌య‌మ్మ షాక్ ఇచ్చారు. గౌర‌వాధ్య‌క్షురాలిగా త‌ప్పుకుంటున్నట్టు వైసీపీ ప్లీన‌రీ వేదిక‌గా ఆమె తీవ్ర భావోద్వేగంతో ప్ర‌క‌టించారు. తాను పార్టీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించే సంద‌ర్భంలో ఆమె స్వ‌రం బొంగుర‌పోవ‌డం గ‌మ‌నార్హం.

ప్లీన‌రీలో భాగంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌ర్వాత గౌర‌వాధ్య‌క్షురాలిగా ఆమె చివ‌రి ప్ర‌సంగం చేశారు. దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంద‌రి వాడ‌న్నారు. మీ అంద‌రి హృద‌యాల్లో ఆయ‌న స‌జీవంగా ఉన్నార‌న్నారు. తెలంగాణ‌లో త‌న‌య వైఎస్ ష‌ర్మిల సొంత పార్టీ పెట్టుకోవ‌డాన్ని ఎవ‌రూ ఊహించ‌లేద‌న్నారు. అయితే ఆంధ్రాలో అన్న‌కు ఇబ్బంది క‌ల‌గొద్ద‌నే ఉద్దేశంతో తెలంగాణ కోడలిగా అక్క‌డ పార్టీ పెట్టి తండ్రి ఆశ‌యాల సాధ‌న‌కు శ్ర‌మిస్తోంద‌న్నారు.

మ‌నిషిగా త‌న జ‌న్మ‌కు సార్థ‌క‌త చేకూర్చుకోవాల‌నే త‌లంపులో భాగంగా ష‌ర్మిల రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌న్నారు. తెలంగాణ‌లో ఏపీలో కంటే ముందుగానే ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌న్నారు. జ‌గ‌న్‌, ష‌ర్మిల వైఎస్సార్ బిడ్డ‌లే అయినా వేర్వేరు రాజ‌కీయ పార్టీల‌కు ప్ర‌తినిధుల‌న్నారు. రెండు పార్టీల‌కు తానే గౌర‌వాధ్య‌క్షురాలిగా ఉండ‌డం వ‌ల్ల విమ‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అవుతుంద‌న్నారు. అలాంటి అవ‌కాశాన్ని ఇవ్వ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు విజ‌య‌మ్మ తెలిపారు.

క‌ష్టాల్లో ఉన్న‌పుడు త‌న కొడుకు జ‌గ‌న్‌తో ఉన్న‌ట్టు గుర్తు చేసుకున్నారు. సంతోషంగా ఉన్న‌ప్పుడు కూడా అండ‌గా వుంటే త‌న ర‌క్తం పంచుకున్న బిడ్డ ష‌ర్మిల‌కు అన్యాయం చేసిందాన్ని అవుతాన‌ని మ‌న‌స్సాక్షి చెబుతోంద‌న్నారు. తెలంగాణ‌లో ష‌ర్మిల‌కు ప్ర‌స్తుతం త‌న అవ‌స‌రం ఉంద‌న్నారు. త‌న ఉనికి ఎవ‌రికీ వివాదాస్ప‌దం కాకూడ‌ద‌నే త‌లంపుతో వైసీసీ గౌర‌వాధ్య‌క్షురాలిగా త‌ప్పుకుంటున్న‌ట్టు ఉద్వేగంగా ప్ర‌క‌టించారామె.

పార్టీ నుంచి కూడా త‌ప్పుకోవాల‌ని అనుకునంటున్న‌ట్టు విజ‌య‌మ్మ తెలిపారు. ఈ విష‌యంలో త‌న‌ను అంద‌రూ క్ష‌మించాల‌ని విజ‌య‌మ్మ స‌భాముఖంగా భావోద్వేగంతో విన్న‌వించుకున్నారు. త‌ల్లిగా జ‌గ‌న్‌కు ఎప్పుడూ త‌న మ‌ద్ద‌తు ఉంటుంద‌న్నారు. ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు త‌న బిడ్డ‌ల‌కు కావాల‌ని వేడుకున్నారు. రాజీనామా ప్ర‌క‌టిస్తున్న సంద‌ర్భంలో వ‌ద్దు వ‌ద్దు అంటూ కార్య‌క‌ర్త‌లు కేక‌లు వేయ‌డం గ‌మ‌నార్హం.