వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పార్టీ పదవికి రాజీనామా చేశారు. ప్లీనరీ వేదికగా.. ఆమె తన నిర్ణయాన్ని ప్రకటించారు.
తెలంగాణలో తన కూతురు షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీలో కూడా ఉంటూ, ఆమెకు అండగా ఉండవలసిన అవసరం పెరుగుతున్నది గనుక.. వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్ష పదవినుంచి తప్పుకుంటున్నానని, కానీ ఒక తల్లిగా ఎప్పటికీ జగన్ మోహన్ రెడ్డి వెంట ఉంటానని ఆమె ప్రకటించారు.
రెండు పార్టీలలోనూ ఉండడం వలన.. ఎవరికీ అభ్యంతరం లేకుండా ఉండేందుకు, ఎవరూ విషప్రచారం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విజయమ్మ వెల్లడించారు.
ఈ సందర్భంగా.. యెల్లో మీడియా మీద విజయమ్మ ఒక స్థాయిలో ధ్వజమెత్తారు. నేను రాయని ఉత్తరాన్ని, నేను చేయని సంతకాన్ని తయారు చేసి.. నేను రాజీనామా చేసినట్లుగా ఒక కుట్ర పూరిత ప్రచారానికి ఎల్లో మీడియా దిగజారడాన్ని అమె చీదరించుకున్నారు.
కష్ట సమయంలో తన కొడుకు జగన్ బాబు వెంట ఉన్నానని, సుఖంగా ఉన్నప్పుడు ఆయనతోనే ఉండిపోకుండా, తన రక్తం పంచుకునే పుట్టి, తెలంగాణ ప్రజలకోసం తన జీవితాన్ని పణంగా పెట్టి ఒంటరి పోరాటం చేస్తున్న కూతురు షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా విజయమ్మ వెల్లడించారు.
విజయమ్మ ప్రసంగం యావత్తూ.. సభికుల హర్షధ్వానాలు, కేరింతల మధ్య భావోద్వేగ భరితంగా సాగింది. ఆమె ఉద్వేగ భరిత ప్రసంగానికి సభ్యులు కదలిపోయారు. ఆమె రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నపుడు సభికులు వద్దు వద్దు అంటూ పెద్దఎత్తున అరిచి తమ అసంతృప్తిని తెలియజేశారు. కానీ.. ముందుగా తీసుకున్న నిర్ణయం కావడంతో, ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉండిపోయారు.
వైఎస్ రాజశేఖర రెడ్డి లేని లోటు తనకు ఎవ్వరూ తీర్చలేరని, తన బిడ్డ జగన్ బాబును మీరు (ప్రజల) చేతుల్లో పెట్టానని, మీరే జగన్ బాబుకు అండగా ఉండాలని ఆమె పిలుపు ఇచ్చారు. ఇవాళ్టి రోజుల్లో రాజకీయం అంటేనే కుట్రలు, అబద్ధపు ప్రచారాలు అన్నట్లుగా తయారైందని అవి కాదని, రాజశేఖర రెడ్డిలాగా ప్రజల కోసం పనిచేసే తత్వమే రాజకీయం కావాలని ఆమె అభిలషించారు.
తన ప్రసంగం చివరిలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత.. ఆమె వేదిక మీద తన కొడుకు జగన్ ను ఆలింగనం చేసుకున్నారు.
విజయమ్మ ఏపీ లోని వైఎస్సార్ కాంగ్రెస్ లోను, తెలంగాణలోని షర్మిల పార్టీలోనూ ఉంటూ వచ్చిన నేపథ్యంలో విపక్షాల వారు అనేక రకాల విషప్రచారానికి ఒడిగట్టారు. తల్లీకొడుకుల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి అనేక కుట్రపూరిత ప్రచారాలు జరిగాయి.
ఒక రాజీనామా లేఖను తయారు చేసి.. విజయమ్మ రాసినట్టుగా ఒక అబద్ధపు ప్రచారంతో.. వారిని బద్నాం చేయడానికి కూడా ప్రయత్నం జరిగింది. అందుకే విజయమ్మ ప్లీనరీ వేదిక మీద తన ప్రసంగంలో.. అలాంటి ప్రచారాల్ని ఎండగట్టడం విశేషం.